Telugu Global
Telangana

ఈ రోజు ఢిల్లీకి కేసీఆర్ ...14న దేశ రాజధానిలో బీఆరెస్ కార్యాలయం ప్రారంభం

14న జరిగే పార్టీ కార్యాలయ‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి దేశ నలుమూలల నుండి రాజకీయ నాయకులు రానున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన స్నేహపూర్వక రాజకీయ పార్టీల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ వేడుకకు హాజరుకావాలని పార్టీ అధిష్టానం ఇప్పటికే ఇతర రాజకీయ పార్టీలకు చెందిన పలువురు సీనియర్ నేతలకు ఆహ్వానాలు పంపినట్లు సమాచారం.

ఈ రోజు ఢిల్లీకి కేసీఆర్ ...14న దేశ రాజధానిలో బీఆరెస్ కార్యాలయం ప్రారంభం
X

దేశ రాజధాని ఢిల్లీ లో ఈ నెల 14న భారత రాష్ట్ర సమితి కార్యాలయాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. ప్రారంభోత్సవం కోసం జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు పార్టీ సీనియర్ నేతలు ఇప్పటికే రాజధానికి చేరుకున్నారు. వీరిలో రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ జే సంతోష్ కుమార్, వాస్తు నిపుణుడు సుద్దాల సుధాకర్ తేజ, ఇతర బీఆర్‌ఎస్ నేతలు ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారు.

ఈ రోజు ముఖ్యమంత్రి, బీఆరెస్ అధ్యక్షులు కేసీఆర్ సతీ సమేతంగా ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఢిల్లీ నూతన కార్యాలయంలో కేసీఆర్ దంపతులు రాజశ్యామల యాగం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

పార్టీ కార్యాలయ‌ ప్రాంగణంలో యాగం నిర్వహించేందుకు తాత్కాలికంగా 'యాగశాల' ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫర్నీచర్‌తో పాటు పునరుద్ధరణ పనులు, సౌకర్యాలను బీఆరెస్ నాయకులు పరిశీలించారు.

14న జరిగే పార్టీ కార్యాలయ‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి దేశ నలుమూలల నుండి రాజకీయ నాయకులు రానున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన స్నేహపూర్వక రాజకీయ పార్టీల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ వేడుకకు హాజరుకావాలని పార్టీ అధిష్టానం ఇప్పటికే ఇతర రాజకీయ పార్టీలకు చెందిన పలువురు సీనియర్ నేతలకు ఆహ్వానాలు పంపినట్లు సమాచారం. మంత్రులు, ఎంపీలు, శాసనసభ్యులు, ఇతర కీలక నేతలతో సహా సీనియర్ బీఆర్‌ఎస్ నేతలందరూ డిసెంబర్ 13 సాయంత్రానికే ఢిల్లీకి చేరుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

ఢిల్లీలోని కొత్త BRS కార్యాలయాన్ని తాత్కాలికంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్గ్‌లో రెండంతస్తుల భవనంలో ఏర్పాటు చేస్తున్నారు. అక్టోబర్‌లో ఢిల్లీకి వెళ్లి ఈ భవనాన్ని పరిశీలించిన కేసీఆర్ దీనికి ఆమోదం తెలిపారు. దేశ రాజధాని నుండి పార్టీ కార్యకలాపాల అవసరాలకు అనుగుణంగా పునర్నిర్మాణం, మరమ్మతులు చేపట్టాలని పార్టీ నాయకులను ఆయన ఆదేశించారు.

రెండంతస్తుల ఈ భవనాన్ని కొన్ని నెలల క్రితం పార్టీ లీజుకు తీసుకుంది. కొంతకాలం పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయంగా ఈ భవన‍ం కొనసాగుతుంది. ఈ భవనంలో పార్టీ అధ్యక్ష కార్యాలయానికి ప్రత్యేక గదులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యాలయం, పార్టీ నేతలతో సమావేశాల కోసం సమావేశ మందిరాలు, మీడియా, డైనింగ్ హాల్, పార్టీ నేతల అవసరాలను తీర్చేందుకు మరికొన్ని గదులు ఉన్నాయి.

మరోవైపు, ఢిల్లీలోని వసంత్ విహార్‌లో బీఆర్‌ఎస్ శాశ్వత కార్యాలయ భవనాన్ని నిర్మిస్తోంది. వసంత్ విహార్‌లో 1,100 చదరపు మీటర్ల స్థలంలో నిర్మాణ పనులు చేపట్టారు. కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి BRS కోసం భారత రాష్ట్రపతి ఈ స్థలాన్ని కేటాయించారు. వసంత్ విహార్ భవనం పూర్తయ్యే వరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్గ్ కార్యాలయం పార్టీ ప్రధాన కార్యాలయంగా ఉంటుంది.

కాగా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఢిల్లీ వీధుల్లో భారీ ఎత్తున హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు వెలిశాయి. కేసీఆర్‌ ఫర్‌ ఇండియా, దేశ్ కా నేత.. కిసాన్‌ కీ భరోసా, అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ అనే నినాదాలతో హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

First Published:  12 Dec 2022 4:12 AM GMT
Next Story