Telugu Global
Telangana

కేసీఆర్ టార్గెట్ 100 లోక్ సభ స్థానాలు?

రాబోయే పార్లమెంట్ జనరల్ ఎలక్షన్లలో వంద లోక్ సభ స్థానాలకు భారత రాష్ట్ర సమితి తరఫున అభ్యర్థులు పోటీపడనున్నట్లు సమాచారం. ఈమేరకు కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

కేసీఆర్ టార్గెట్ 100 లోక్ సభ స్థానాలు?
X

2001 లో ఉప ప్రాంతీయ పార్టీగా ప్రారంభమై, స్థానిక ఎన్నికల్లో సత్తా చూపి, ఆపై తెలంగాణలో కొన్ని నియోజకవర్గాల్లో పట్టు పెంచుకుంటూ ఒక వైపు ఉద్యమం , మరో వైపు ఎన్నికల‌ రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ......చివరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించి అత్యధిక మెజార్టీతో అధికారం సాధించే దాకా అనేక‌ ఆటు పోట్లను ఎదుర్కొంటూ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్థానం సాగింది. ముందు ఉత్తర తెలంగాణాలోనే బల‍ంగా ఉందని, దక్షిణ తెలంగాణలో టీఆరెస్ ఉనికి లేదన్న విమర్శలను అదిగమిస్తూ నల్గొండ లాంటి కాంగ్రెస్ కంచు కోటను బద్దలు కొట్టి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలను కైవసం చేసుకుంది. ఇప్పుడిక ఉత్తర, దక్షిణ తేడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు టీఆరెస్ కే జై కొడుతున్నారు. ఎక్కడ ఎన్నిక జరిగినా వార్ ఒన్ సైడే అన్నట్టుగా ఉంది ప్రస్తుతం టీఆరెస్ స్థితి.

ఈ పరిస్థితుల్లో కేంద్ర బీజేపీ సర్కార్ తెలంగాణపై కక్షగట్టి వేదిస్తున్న తీరు ఆందోళన కలిగించే విధంగా ఉంది. కేంద్రం తెలంగాణ పట్ల చూపిస్తున్న వివక్ష ప్రజలను కష్టాలపాలు చేస్తున్నది. ఒక్క తెలంగాణపట్లనే కాక బీజేపీయేతర ప్రభుత్వాలు పరిపాలిస్తున్న అన్ని రాష్ట్రాల పట్ల బీజేపీ సర్కార్ ఇదే వైఖరి అవలంభిస్తున్నది. అక్కడితో ఆగలేదు బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేస్తూ ప్రజాస్వామ్యాన్నే ఖూనీ చేస్తున్న‌దనే ఆరోపణలు ఎదుర్కొంటున్నది. ఈ విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు అనేక సార్లు బీజేపీ తీరును ఎండగట్టారు. ఫెడరిలిజానికి సమాధికట్టి రాష్ట్రాలకు ఏ మాత్రం హక్కులు లేకుండా చేస్తున్న బీజేపీ సర్కార్ తీరుపట్ల కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారు. అదొక్కటే కాదు బీజేపీ పాలన దేశాన్ని ఆర్థికంగా, సామాజికంగా ఛిన్నాభిన్నం చేసిందనే అభిప్రాయంతో ఉన్నారు కేసీఆర్. ఈ నేపథ్యంలో రూపుదిద్దుకున్నదే 'భారత రాష్ట్ర సమితి' (బీఆరెస్).

దేశంలో అన్ని పార్టీలతో పాటు మరో పార్టీగా కాకుండా ప్రత్యామ్నాయ రాజకీయాలతో దేశాన్ని మార్చాలన్న భావన వ్యక్తం చేస్తున్న కేసీఆర్ అందుకు తగ్గ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా రైతు సంఘాలతో, మేదావులతో, వివిధ పార్టీలతో చర్చలు జరిపిన కేసీఆర్ బీఆరెస్ ను దేశంలో బలమైన శక్తిగా తయారు చేయడానికి నడుం భిగించారు. బీజేపీ పై పోరాటానికి కలిసి వచ్చే శక్తులన్నింటినీ కలుపుకుపోతానని కేసీఆర్ బహిరంగంగానే ప్రకటించి బీజేపీపై యుద్దం ప్రకటించారు.

ఇప్పుడిక ఇతర రాష్ట్రాల్లో విస్తరించడం కోసం వేగంగా అడుగులు వేస్తున్నారు కేసీఆర్. భారతీయ రాష్ట్ర సమితిని మొదట ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు,మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో విస్తరించాలనే ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం. కేసీఆర్ 2024 లోక్ సభ ఎన్నికల్లో దాదాపు 100 ఎంపీ సీట్లకు పోటీ చేయాలన్న లక్ష్యం పెట్టుకున్నారని తెలుస్తోంది. అందుకు తగ్గ కార్యాచరణను అప్పుడే ప్రారంభించారు. ఇప్పటికే కర్నాటక, ఆంధ్రప్రదేశ్ , మహారాష్ట్రకు చెందిన అనేక మంది రైతులు కేసీఆర్ ను కలిశారు. అంతే కాదు తమిళనాడులో బలమైన ప్రభావం చూపించగలిగే 'విడుతలై చిరుతైగల్ కచ్చి' అనే పార్టీ నేత ఎంపీ తిరుమాలవన్ కేసీఆర్ తో సమావేశమవడమే కాక బీఆరెస్ కు పూర్తి మద్దతు ప్రకటించారు. కర్నాటకలోని జనతాదళ్ ఎస్ అధ్యక్షుడు కుమార స్వామి కూడా కేసీఆర్ తో సమావేశమయ్యారు. అంతే కాదు బీఆరెస్ కు తమ పార్టీ మద్దతు ప్రకటించారు.

ఈ క్రమంలో బీఆరెస్ తరపున 100 సీట్లకు పోటీ చేయాలన్న ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్టు టీఆరెస్ వర్గాలు చెప్తున్నాయి. అయితే బీఆర్ఎస్ అభ్యర్థులు ఎక్కడెక్కడ పోటీ చేస్తారు.. ఏయే పార్టీలతో బీఆఱె పొత్తు పెట్టుకుంటుంది అనే వివరాలను ఇప్పుడే చెప్పలేమని టీఆర్ఎస్ నేత బి.వినోద్ కుమార్ పేర్కొన్నారు. డిసెంబర్ 7 న బీఆర్ఎస్ పేరు అధికారికంగా ఖరారైన తర్వాత పార్టీ అధినేత కేసీఆర్ అన్ని వివరాలు వెల్లడిస్తారని వివరించారు.

ఈ నేపథ్యంలో త్వరలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలో జరగనున్న ఎన్నికల్లో కూడా బీఆరెస్ తరపున ప్రచారం చేయనున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ నుండి తన నాయకత్వంలో దాదాపు వంద మంది ఎమ్మెల్యేలు, ఎంపీల బృందం ఆయా రాష్ట్రాల్లో ప్రచారం చేస్తుందని కేసీఆర్ తెలిపారు.

First Published:  8 Nov 2022 6:08 AM GMT
Next Story