Telugu Global
Telangana

కాంగ్రెస్ 420.. బీజేపీ 400

సీఎం రేవంత్ రెడ్డి పనిచేసే సిపాయి కాదని ఎద్దేవా చేశారు కేసీఆర్. అయితే దేవుడిపై ఒట్లు, లేదంటే కేసీఆర్ పై తిట్లు.. 5 నెలలుగా జరుగుతోంది ఇదే కదా అని చెప్పారు.

కాంగ్రెస్ 420.. బీజేపీ 400
X

420 హామీలిచ్చిన కాంగ్రెస్ తెలంగాణ ప్రజల్ని దారుణంగా మోసం చేసిందని అన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఎన్నికల్లో గెలవగానే ఆరు గ్యారెంటీలను చట్టబద్ధం చేస్తామంటూ కబుర్లు చెప్పారని, తీరా ఇప్పుడు బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జిల్లాలు తీసేస్తానని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, మెదక్ జిల్లా తీసేస్తానంటున్నారని.. మెదక్ కోసం యుద్ధం చేద్దామా..? అని అన్నారు కేసీఆర్. మెదక్ జిల్లాగా ఉండాలంటే పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలవాలన్నారు. కామారెడ్డిని కూడా జిల్లాగా తీసేస్తానంటున్నారని, కామారెడ్డి జిల్లాగానే ఉండాలంటే జహీరాబాద్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ని గెలిపించాలని పిలుపునిచ్చారు. మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఆయన కార్నర్ మీటింగుల్లో పాల్గొన్నారు.

పనిచేయని సిపాయి..

సీఎం రేవంత్ రెడ్డి పనిచేసే సిపాయి కాదని ఎద్దేవా చేశారు కేసీఆర్. ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుడిపై ఆయన ఒట్టు పెడుతున్నారని, పనిచేసే సిపాయి ఎవరైనా ఒట్లు పెట్టుకుంటారా అని అన్నారు. అయితే దేవుడిపై ఒట్లు, లేదంటే కేసీఆర్ పై తిట్లు.. 5 నెలలుగా జరుగుతోంది ఇదే కదా అని చెప్పారు.

400 అంటే సీట్లు కాదు..

బీజేపీ 400 సీట్లు కావాలంటోందని, అందులో మరో మర్మం దాగుందని సెటైర్లు పేల్చారు కేసీఆర్. బీజేపీకి 400 సీట్లు ఇస్తే, పెట్రోల్ రేట్ గ్యారెంటీగా రూ.400 దాటుతుందని చెప్పారు. ఈసారి కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే అని, బీజేపీకి 200 సీట్లు కూడా రావని పేర్కొన్నారు కేసీఆర్. బీజేపీ ఎప్పటికీ దోపిడీదారులు, పెట్టుబడిదారుల పార్టీయే కానీ, అది పేదల పార్టీ కాదని అన్నారు.

దేశ ప్రధానిగా పదేళ్లు పాలించిన మోదీ.. 150 హామీలిచ్చారని, ఒక్కటి కూడా నెరవేర్చలేదని చెప్పారు కేసీఆర్. సబ్‌కా సాత్‌.. సబ్‌కా వికాస్‌ జరగలేదని, దాని బదులు.. సబ్‌ కా సత్యనాశ్‌ అయిందని ఎద్దేవా చేశారు. అచ్చేదిన్ రాకపోగా సచ్చేదిన్ వచ్చాయని అన్నారు కేసీఆర్. దేశం దెబ్బతిన్నదని, రూపాయి విలువ డాలర్‌తో చూసుకుంటే రూ.84 అయిందని, ఎగుమతులు ఆగిపోయాయని, దిగుమతులు పెరిగాయని అన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని.. మేకిన్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా.. అన్నీ ఫెయిలయ్యాయని విమర్శించారు కేసీఆర్.

ప్రధాని మోదీ, తెలంగాణకు ఏ నాడూ ఒక్క మంచిపని చేయలేదన్నారు కేసీఆర్. తెలంగాణ ముచ్చట ఎప్పుడు వచ్చినా తల్లిని చంపి.. బిడ్డను బతికించారనే దిక్కుమాలిన మాట మాట్లాడతారని విమర్శించారు. బీజేపీ పరిపాలన మనకు ఏవిధంగానూ మంచిది కాదన్నారు కేసీఆర్.

First Published:  7 May 2024 5:48 PM GMT
Next Story