Telugu Global
Telangana

కేంద్రం గేమ్ స్టార్ట్ చేసింది - కేసీఆర్‌

ప్రస్తుత తెలంగాణ పాలకులు KRMBకి నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులు అప్పజెప్పి..కేంద్రం చేతికి మన జుట్టు అప్పజెప్పారని కామెంట్ చేశారు కేసీఆర్.

కేంద్రం గేమ్ స్టార్ట్ చేసింది - కేసీఆర్‌
X

అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్‌కు వచ్చిన కేసీఆర్‌.. దక్షిణ తెలంగాణ జిల్లాల ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. కృష్ణా ప్రాజెక్టుల కోసం పోరాటం చేయాలని నిర్ణయించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడుకోవడానికి ఎందాకైనా పోరాడదామని నేతలకు సూచించారు. ఇక ఈనెల 13న నల్గొండలో కృష్ణా జలాల పరిరక్షణ కోసం భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు గులాబీ బాస్‌. ఈ సభ‌కు ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల నుంచి రెండు లక్షల మంది హాజ‌రుకానున్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వ అనాలోచిత వైఖరి దక్షిణ తెలంగాణ రైతులకు గొడ్డలిపెట్టులాంటిదన్నారు. తెలంగాణ ఉద్యమంలో మా నీళ్లు మాకేనన్న ప్రజా నినాదాన్ని స్వయంపాలన ప్రారంభమైన అనతికాలంలోనే నిజం చేసి చూపించిన ఘనత బీఆర్ఎస్‌ పార్టీదేనన్నారు. KRMB పేరుతో కృష్ణా నదీ ప్రాజెక్టులపై హక్కులను సొంతం చేసుకునేందుకు కేంద్రం వేసే ఎత్తుగడలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ పదేళ్ల పాటు బీఆర్ఎస్ కృషి చేసిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో ప్రాజెక్టుల కట్టల మీదకు పోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.

ప్రస్తుత తెలంగాణ పాలకులు KRMBకి నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులు అప్పజెప్పి..కేంద్రం చేతికి మన జుట్టు అప్పజెప్పారని కామెంట్ చేశారు కేసీఆర్. ఈ నిర్ణయంతో హైదరాబాద్‌, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాల ప్రజలకు సాగునీరు, తాగు నీరు అందక కరువు కోరల్లో చిక్కుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ వ్యవసాయ రైతాంగ వ్యతిరేక నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు కేసీఆర్. ప్రస్తుత పాలకులకు ప్రాజెక్టులు, నీళ్ల గురించి అవగాహన లేకపోవడంతో కేంద్రం గేమ్ స్టార్ట్ చేసిందన్నారు కేసీఆర్. కాంగ్రెస్‌ నేతలు అవగాహన లేక ఏదేదో మాట్లాడుతున్నారని.. కృష్ణా ప్రాజెక్టులు కేంద్రం చేతుల్లోకి వెళ్తే దక్షిణ తెలంగాణ జిల్లాలు ఎడారిగా మారతాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో కేసీఆర్ సీఎం రేవంత్ పేరు కూడా ఎత్తలేదని సమాచారం.

First Published:  6 Feb 2024 10:17 AM GMT
Next Story