Telugu Global
Telangana

యుద్ధం మిగిలే ఉంది -కేసీఆర్

తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రజల భావాలను వ్యాప్తి చేయడంలో కవులు, కళాకారుల పాత్ర ప్రశంసనీయం అన్నారు కేసీఆర్. వారి వల్లే ఉద్యమం ఉధృతమైందని గుర్తు చేశారు.

యుద్ధం మిగిలే ఉంది -కేసీఆర్
X

తెలంగాణలో యుద్ధం ఇంకా మిగిలే ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఉద్యమ శక్తులను మరోసారి పునరేకీకరణ చేసే అవసరం వచ్చిందని, కార్యక్షేత్రానికి రూపకల్పన చేస్తున్నామని అన్నారు. భూమి పుత్రుడు - 'సన్ ఆఫ్ ది సాయిల్' అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన కేసీఆర్ మరో ఉద్యమం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.


తెలంగాణ రాజకీయ, సామాజిక అంశాల్లో వచ్చిన మార్పులు, రాష్ట్ర ప్రగతి, రైతాంగం అభివృద్ధికి గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు.. వంటి అంశాలపై తెలంగాణ ఉద్యమకారుడు గోసుల శ్రీనివాస్‌యాదవ్ పలు వ్యాసాలు రాశారు. ఆ వ్యాసాల సంకలనమే భూమిపుత్రుడు పుస్తకం. ఈ పుస్తకాన్ని ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హరీష్ రావు కూడా పాల్గొన్నారు. తెలంగాణ మలి దశ ఉద్యమం, తెలంగాణ ప్ర‌గ‌తిని..ప్ర‌జ‌ల‌కు అర్థమయ్యేలా ఈ పుస్తకంలో వివరించారని రచయిత శ్రీనివాస్ యాదవ్ ని కేసీఆర్ ప్ర‌శంసించారు.

కవులు, కళాకారులు ఏకం కావాలి..

తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రజల భావాలను వ్యాప్తి చేయడంలో కవులు, కళాకారుల పాత్ర ప్రశంసనీయం అన్నారు కేసీఆర్. వారి వల్లే ఉద్యమం ఉధృతమైందని గుర్తు చేశారు. మరోసారి కవులు, కళాకారులు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం తిరోగమన దిశలో తీసుకెళ్తోందని విమర్శించారాయన. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. త్వరలో ఉద్యమ కవులు, కళాకారులు, రచయితలతో ఒక సమావేశం పెట్టుకుందామన్నారు కేసీఆర్. రచయితలకు తాము అన్ని విధాలుగా తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు.

First Published:  17 May 2024 4:05 PM GMT
Next Story