Telugu Global
Telangana

ప్రధాని రేసులో ఉంటా.. కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రధాని మోదీ దుర్మార్గాలు పెరిగిపోయాయని, గోబెల్స్ ప్రచారంతో ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు కేసీఆర్.

ప్రధాని రేసులో ఉంటా.. కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా 16 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్ర నిర్వహించిన కేసీఆర్.. మీడియా సమావేశంలో దేశ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అని అన్నారాయన. తనకున్న రాజకీయ సంబంధాలు, శక్తి, తెలివిని రంగరించి ప్రాంతీయ కూటమి కోసం ప్రయత్నాలు చేస్తానని చెప్పారు. ఏదో ఒక జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీల కూటమికి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితిని సృష్టిస్తామన్నారు కేసీఆర్.


దేశ ప్రధానిగా పనిచేసే అవకాశం వస్తే వంద శాతం తాను రేసులో ఉంటానని.. అవకాశం వస్తే వదులుకునేంత అమాయకుడిని కాదని స్పష్టం చేశారు కేసీఆర్. బీఆర్‌ఎస్‌ తో జాతీయ రాజకీయాలను కొనసాగిస్తామన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ 12 నుంచి 14 ఎంపీ స్థానాల్లో గెలిచితీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ 9 చోట్ల మూడో స్థానంలో ఉందని, బీజేపీ రెండో స్థానంలో ఉన్నా కూడా బీఆర్‌ఎస్‌కు చాలా దూరంలో ఉందని పేర్కొన్నారు కేసీఆర్.

మీడియా సమావేశంలో పలు విషయాలపై సూటిగా స్పందించారు కేసీఆర్. కేంద్ర పాలిత ప్రాంతం పేరిట హైదరాబాద్‌ గొంతు కోస్తే తెలంగాణ ప్రజలు సహించబోరని అన్నారాయన. కాంగ్రెస్, బీజేపీ వంటి పిచ్చివాళ్లకు స్థానమిస్తే హైదరాబాద్‌ను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తారన్నారు. హైదరాబాద్‌ తెలంగాణ సొంతం అని, ఎన్నటికీ వదులుకోబోమని తేల్చి చెప్పారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై మరోసారి స్పందించారు కేసీఆర్. గూఢచార వ్యవస్థ లేని ప్రభుత్వం ఉండదని, నిఘా విభాగం నుంచి ప్రభుత్వం కేవలం సమాచారం మాత్రమే కోరుతుందని, ట్యాపింగ్‌ పూర్తిగా పోలీసు విభాగం అంతర్గత విషయం అని అన్నారాయన. అప్పటి తమ ప్రభుత్వానికి ట్యాపింగ్ తో సంబంధం లేదన్నారు.

ప్రధాని మోదీ దుర్మార్గాలు పెరిగిపోయాయని, గోబెల్స్ ప్రచారంతో ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు కేసీఆర్. మత విద్వేషాలను రెచ్చగొట్టి దేవుడి పేరిట ఓట్లు కొల్లగొట్టే పార్టీ బీజేపీ అని అన్నారు. హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా.. అసమానతకు గురైన ఎస్సీ, ఎస్టీ, ఎంబీసీ, మైనారిటీలందిరికీ న్యాయం జరగాలని ఆకాంక్షించారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ మోదీ సృష్టించిన రాజకీయ కుట్ర అని అన్నారాయన. తాను, కేజ్రీవాల్‌ మోదీకి కంటిలో నలుసులా తయారయ్యామని, అందుకే తమపై కక్షసాధిస్తున్నారని చెప్పారు కేసీఆర్. ఈ కుట్రలను తాము ఎదుర్కొంటామన్నారు.

First Published:  12 May 2024 1:19 AM GMT
Next Story