Telugu Global
Telangana

సంపదను సృష్టించడంలో అన్ని రాష్ట్రాల కంటే ముందున్న తెలంగాణ ప్రభుత్వం

2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు ప్రభుత్వ భవనాల విస్తీర్ణం కేవలం 60 లక్షల చదరపు అడుగులుగా ఉండగా.. ఇప్పుడు అది 2.30 కోట్ల చదరపు అడుగులకు పెరిగింది.

సంపదను సృష్టించడంలో అన్ని రాష్ట్రాల కంటే ముందున్న తెలంగాణ ప్రభుత్వం
X

ఒక రాష్ట్రానికి ఆస్తులను సంపాదించడం, సృష్టించడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం గత 8 ఏళ్లలో అనేక ఆస్తులను ప్రభుత్వ ఖాతాలో చేర్చింది. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు ప్రభుత్వ భవనాల విస్తీర్ణం కేవలం 60 లక్షల చదరపు అడుగులుగా ఉండగా.. ఇప్పుడు అది 2.30 కోట్ల చదరపు అడుగులకు పెరిగింది. ఈ ఒక్క ఉదహరణతోనే తెలంగాణలో ఎంత మేర సంపద సృష్టించబడిందో అర్థం అవుతోంది.

కొత్తగా నిర్మించబడిన సెక్రటేరియట్ విస్తీర్ణమే 8.50 లక్షల చదరపు అడుగులు ఉన్నది. దీనికి తోడు జిల్లాల్లో కొత్తగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు, విద్యా సంస్థలు, ఆసుపత్రులను కలిపితే భారీగా సంపద తెలంగాణ ప్రభుత్వ సొంతమైనట్లు తెలుస్తున్నది. తెలంగాణ సోషియో-ఎకానమీ సర్వే 2023ను ఇటీవల బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆ లెక్కలను అనుసరించి.. దేశంలో గోవా తర్వాత అత్యధిక సంపద సృష్టించిన రాష్ట్రంగా తెలంగాణ ఉన్నది. ఇక పెద్ద రాష్ట్రాల విషయంలో అయితే తెలంగాణే నెంబర్ 1న ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో సంపద సృష్టించడానికి పర్ క్యాపిటా డెవలెప్‌మెంట్ ఎక్స్‌పెండీచర్‌లో కూడా తెలంగాణ ముందున్నది.

తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అప్పటి వరకు ఉన్న 10 జిల్లాలను 33కు పెంచారు. దీంతో ఆయా జిల్లాల అవసరాల కోసం ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లను నిర్మించారు. అంతే కాకుండా కొత్త సెక్రటేరియట్, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను కూడా నిర్మించారు. వీటన్నింటి విస్తీర్ణమే 40 లక్షల చదరపు అడుగులకు పైగా ఉంటుంది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక ప్రాజెక్టుల్లో ఎక్కువగా రోడ్లు, భవనాల శాఖే చేపట్టింది. దీనిపై మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పందించారు.

'సంపదను సృష్టించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ఆస్తుల నిర్మాణంలో నేను నిర్వహిస్తున్న ఆర్ అండ్ బీ శాఖ ఇన్వాల్వ్ కావడం చాలా సంతోషంగా ఉన్నది. ఇటీవల ఖమ్మం నగరాన్ని పంజాబ్, ఢిల్లీ ముఖ్యమంత్రులు సందర్శించారు. అక్కడి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ను చూసి రాష్ట్ర సచివాలయం లాగా ఉందని అనడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇప్పటి వరకు నేను అందుకున్న మంచి అభినందన అదే' అని మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం 8.50 లక్షల చదరపు అడుగుల సెక్రటేరియట్ భవనం కోసం రూ.617 కోట్లు, 5.06 లక్షల చదరపు అడుగుల కమాండ్ కంట్రోల్ సెంటర్ కోసం రూ.585 కోట్లు, జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల కోసం రూ.1,600 కోట్లు ఖర్చు చేయగా.. వీటి వైశాల్యం 32 లక్షల చదరపు అడుగులుగా ఉన్నట్లు అధికారులు తెలియజేశారు.

ఇక ఐటీ మంత్రి కేటీఆర్ చొరవతో అనేక ప్రాజెక్టులు హైదరాబాద్‌కు వస్తున్నాయి. కొత్తగా ఐటీ రంగంలో స్టార్టప్‌లు మొదలు పెట్టే వారి కోసం టీ-హబ్‌ను ఏర్పాటు చేశారు. తొలి దశ విజయవంతం కావడంతో ఇటీవల టీ-హబ్ 2.0తో పాటు ఇతర జిల్లాలకు కూడా ఐటీ టవర్లను విస్తరించారు. రూ.400 కోట్లతో నిర్మించిన టీ-హబ్ 2.0 5.83 లక్షల చదరపు అడుగులు ఉండగా.. ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, సిద్ధిపేట, నల్గొండ, అదిలాబాద్‌లో 4,85,850 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు.

వీటితో పాటు వైద్యారోగ్య శాఖ పరిధిలో కూడా భారీగా ఆస్తులు సృష్టించబడ్డాయి. వరంగల్‌లో నిర్మిస్తున్న హెల్త్ సిటీ‌లో 24 అంతస్తుల ఆసుపత్రి బిల్డింగ్ కోసం రూ.1,200 కోట్లు వెచ్చిస్తుండగా.. ఇందులో 16.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి రానున్నది. ఈ ఏడాది చివరిలోగా ఈ బిల్డింగ్ పూర్తి చేసేలా పనులు వేగవంతం చేశారు. ఇక కొత్త మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల ద్వారా 32 లక్షల చదరపు అడుగుల స్పేస్ ప్రభుత్వ ఖాతాలో చేరింది.

హైదరాబాద్ నగరంలో నిర్మిస్తున్న మూడు టిమ్స్ ఆసుపత్రుల కోసం రూ.2,000 కోట్లు ఖర్చు చేస్తున్నారు. దీని ద్వారా 41 చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి రానున్నది. అల్వాల్, గడ్డి అన్నారం, ఎర్రగడ్డల్లో ఒక్కో ఆసుపత్రిని రూ.900 కోట్లతో నిర్మిస్తున్నారు. వీటి బిల్డప్ ఏరియా 13.71 చదరపు అడుగులుగా ఉండగా.. ఒక్కో ఆసుపత్రిలో 1,000 బెడ్లు ఉండబోతున్నాయి.

ఇక బంజారా భవన్ 61,544 చదరపు అడుగులు, ఆదివాసీ భవన్ 82,009 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఒక్కో భవంతికి రూ.25 కోట్లు ఖర్చు చేశారు. హైదరాబాద్ నగరంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల కోసం భారీ అపార్ట్‌మెంట్స్ నిర్మించింది. ఒక్కొక్కటి 2,400 చదరపు అడుగుల బిల్డప్ ఏరియాతో 120 అపార్ట్‌మెంట్లు నిర్మించారు. దీంతో మొత్తం 2.88 లక్షల చదరపు అడుగులు అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు 119 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల కోసం క్యాంపు కార్యాలయాలను నిర్మించాలని నిర్ణయించారు. అది కూడా పూర్తయితే 4.23 లక్షల చరదపు అడుగుల అందుబాటులోకి రానున్నాయి.

కేవలం బిల్డింగ్స్ నిర్మించడం ద్వారానే కాకుండా భారీ ప్రాజెక్టుల వల్ల కూడా తెలంగాణ ప్రభుత్వ ఆస్తులు పెరిగాయి. ప్రపంచంలోనే అతి భారీ లిఫ్ట్ ఇరిగేషన్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం దాదాపు రూ.1 లక్ష కోట్లు ఖర్చు చేశారు. ఇక మిషన్ భగీరథ కోసం రూ.35 వేల కోట్ల వరకు ఖర్చు అయ్యాయి. ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వ సంపద పెరగడంలో భాగమయినట్లు అధికారులు చెబుతున్నారు.

First Published:  20 Feb 2023 3:20 AM GMT
Next Story