Telugu Global
Telangana

లోక్‌సభ ఎన్నికలకు కేసీఆర్ ఫ్యామిలీ దూరం.. కవిత ప్లేస్‌లో కొత్త అభ్యర్థి..!

2014 లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన కవిత.. 2019 ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. అయితే ఆమె ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. మరో మూడేళ్లకుపైగా పదవీ కాలం కూడా ఉంది.

లోక్‌సభ ఎన్నికలకు కేసీఆర్ ఫ్యామిలీ దూరం.. కవిత ప్లేస్‌లో కొత్త అభ్యర్థి..!
X

రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం తెలంగాణలోని ప్రధాన పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఊపు మీదున్న కాంగ్రెస్‌ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లోనూ సీన్ రిపీట్ చేయాలని భావిస్తుండగా.. ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్‌ లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా సిట్టింగ్‌ ఎంపీలందరిని మార్చుతారని తెలుస్తోంది. ఇప్పటివరకూ కేవలం చేవెళ్ల, కరీంనగర్ అభ్యర్థుల విషయంలో మాత్రమే క్లారిటీ వచ్చింది. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి పోటీకి పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

లోక్‌సభ ఎన్నికల విషయంలో కేసీఆర్ ఫ్యామిలీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఫ్యామిలీ నుంచి ఎవరు పోటీ చేయకూడదని నిర్ణయించినట్లు సమాచారం. మొన్నటివరకు మెదక్‌ నుంచి కేసీఆర్‌, నిజామాబాద్ నుంచి కవిత, మల్కాజ్‌గిరి నుంచి కేటీఆర్ పోటీ చేస్తారంటూ ఊహగానాలు వచ్చాయి. కానీ, ఇదంతా కేవలం ప్రచారం మాత్రమేనని తెలుస్తోంది. ప్రస్తుతమున్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర రాజకీయాలపైనే ఫోకస్ చేయాలని గులాబీ బాస్‌ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి.

2014 లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన కవిత.. 2019 ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. అయితే ఆమె ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. మరో మూడేళ్లకుపైగా పదవీ కాలం కూడా ఉంది. ప్రస్తుతమున్న ప్రత్యేక పరిస్థితుల్లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కొత్త అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కవిత ఇకపై రాష్ట్ర రాజకీయాలకే పరిమితమవుతారని తెలుస్తోంది.

గతంలో కేసీఆర్ కూడా క‌రీంనగర్, మహబూబ్‌నగర్‌ నుంచి ఎంపీగా పనిచేశారు. 2014లో మెదక్ ఎంపీ స్థానం, గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి రెండు చోట్ల గెలిచారు. తర్వాత మెదక్ ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. కేసీఆర్‌ ఫ్యామిలీ నుంచి సంతోష్‌ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.

First Published:  23 Jan 2024 9:02 AM GMT
Next Story