Telugu Global
Telangana

తుమ్మలపై కేసీఆర్ డైరెక్ట్‌ అటాక్‌!

బీఆర్ఎస్‌ అన్యాయం చేసిందని తుమ్మల మాట్లాడడం సరికాదన్నారు. తుమ్మలకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందో, తుమ్మల బీఆర్ఎస్‌కు అన్యాయం చేశారో ప్రజలే నిర్ణయించాలన్నారు.

తుమ్మలపై కేసీఆర్ డైరెక్ట్‌ అటాక్‌!
X

తుమ్మలపై కేసీఆర్ డైరెక్ట్‌ అటాక్‌!

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై డైరెక్ట్‌ అటాక్‌ చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పాలేరులో పార్టీ అభ్యర్థి ఉపేందర్‌ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు కేసీఆర్. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పువ్వాడ అజయ్‌ చేతిలో ఓడిన తుమ్మలను పాత స్నేహం కారణంగా చేరదీశానన్నారు కేసీఆర్‌.

ఏ పదవి లేనప్పటికీ మంత్రిని చేశానన్నారు. తర్వాత రాంరెడ్డి వెంకట్‌ రెడ్డి మరణంతో పాలేరు స్థానానికి జరిగిన ఉపఎన్నికలో ఆయన భార్యకు అవకాశమివ్వాలని భావించామన్నారు. కానీ తుమ్మల కోరడంతోనే ఆయనను పాలేరులో బరిలో ఉంచామని చెప్పారు. కానీ ఇవాళ బీఆర్ఎస్‌ అన్యాయం చేసిందని తుమ్మల మాట్లాడడం సరికాదన్నారు. తుమ్మలకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందో, తుమ్మల బీఆర్ఎస్‌కు అన్యాయం చేశారో ప్రజలే నిర్ణయించాలన్నారు.

ఇక ఖమ్మం జిల్లాలో ఒకరిద్దరు బహురూపుల నాయకులున్నారంటూ..పరోక్షంగా పొంగులేటిని ఉద్దేశించి కామెంట్స్ చేశారు కేసీఆర్. డబ్బు అహంకారంతో ఎవరినైనా కొనగలమని మాట్లాడుతున్నారన్నారు. ఆ నాయకులే పాలేరులో నిలబడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ వాకిలి తొక్కనివ్వమంటున్నారని, కానీ అది నిర్ణయించేది ప్రజలేనని కేసీఆర్ చెప్పారు. డబ్బు సంచులతో వచ్చే వారిని నమ్మొద్దన్నారు.

ఇక కాంగ్రెస్ పార్టీపైనా నిప్పులు చెరిగారు కేసీఆర్. పొరపాటున కాంగ్రెస్‌ గెలిస్తే రైతుబంధుకు రాంరాం, దళితబంధుకు జైభీమ్ అంటారని సెటైర్లు వేశారు. డబ్బు కట్టలతో ప్రజలను కొంటామనేవారికి బుద్ది చెప్పాలన్నారు కేసీఆర్. కాంగ్రెస్‌ నాయకుల వైఖరి రైతులకు వ్యతిరేకంగా ఉందన్నారు. రైతుబంధు, కరెంటు వద్దనే కాంగ్రెస్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు.

First Published:  27 Oct 2023 11:17 AM GMT
Next Story