Telugu Global
Telangana

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధపడుతున్న సీఎం కేసీఆర్.. ఎమ్మెల్యేల పని తీరుపై ఫోకస్

ప్రజల మూడ్ ఎలా ఉన్నది, ఇతర పార్టీలేవైనా బలపడుతున్నాయా అనే కోణంలో ఈ సర్వే ఉండబోతోంది. సర్వే వివరాలు నేరుగా సీఎంకే చేరనున్నాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధపడుతున్న సీఎం కేసీఆర్.. ఎమ్మెల్యేల పని తీరుపై ఫోకస్
X

తెలంగాణ అసెంబ్లీ గడువు ఈ ఏడాది డిసెంబర్‌లో ముగియనున్నది. నవంబర్-డిసెంబర్ మధ్యన ఎప్పుడైనా రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం ఉన్నది. మరో 8 నెలలు మాత్రమే సమయం ఉండటంతో అసెంబ్లీ ఎన్నికల వైపు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారు. ఇప్పుడు ఎన్నికలకు ఎలా ముందుకు వెళ్లాలనే విషయాలపై పార్టీలోని సీనియర్లు, మంత్రులతో చర్చలు జరుపుతున్నారు.

నిరుడు సీఎం కేసీఆర్ నాలుగు అంతర్గత సర్వేలు చేయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యేలు, మంత్రుల పని తీరు ఎలా ఉన్నది? ప్రజల్లో బీఆర్ఎస్‌పై ఎంత వరకు ఆదరణ ఉన్నది? ఏయే నియోజకవర్గాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నదనే విషయాలను ఈ సర్వే ద్వారా తెలుసుకున్నారు. కొంత మంది ఎమ్మెల్యేల పని తీరుపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదని తేలడంతో వారికి ఇప్పటికే పలు సూచనలు చేసినట్లు సమాచారం. గతంలోనే బీఆర్ఎస్ లెజిస్లేటీవ్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి.. హైదరాబాద్ వదిలి ఎవరి నియోజకవర్గాలకు వారు వెళ్లాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సాధ్యమైనంత వరకు ప్రజల్లోనే ఉండి పని తీరు మార్చుకోవాలని కేసీఆర్ సూచించారు.

ఇక తాజాగా మరోసారి పొలిటికల్ సర్వేలు చేయించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తున్నది. రాబోయే 9 నెలల్లో మూడు సర్వేలు చేయించడానికి ఆయన సిద్ధపడుతున్నారు. ప్రజల మూడ్ ఎలా ఉన్నది, ఇతర పార్టీలేవైనా బలపడుతున్నాయా అనే కోణంలో ఈ సర్వే ఉండబోతోంది. సర్వే వివరాలు నేరుగా సీఎంకే చేరనున్నాయి. వాటి ఆధారంగా ఆయన ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

25 ప్రశ్నలతో కూడిన ఈ సర్వేలో.. వివిధ వర్గాలకు చెందిన ప్రజల నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీటిలో ఎక్కువగా మీ ఎమ్మెల్యే, మీ మంత్రి అందుబాటులో ఉంటున్నారా అనే వాటికే ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా.. క్షేత్ర స్థాయిలో ఎమ్మెల్యేల పని తీరుపైనే పార్టీ గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. అందుకే అలాంటి ప్రశ్నలకే కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారు. వాటి ఆధారంగానే టికెట్లు వస్తాయా రావో తెలియనున్నది.

ఇక ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, వినతులపై స్థానిక ఎమ్మెల్యే స్పందన ఎలా ఉందనే విషయాన్ని కూడా తెలుసుకోనున్నారు. అంతే కాకుండా వారి బంధువులు, సన్నిహితులు, స్నేహితులు లేదా అనుచరులు ఏమైనా పాలనలో జోక్యం చేసుకుంటున్నారా? రాజ్యంగేత వ్యక్తుల జోక్యం అధికంగా ఉందా అనే విషయాలను కూడా సేకరించనున్నారు. ఈ సారి సర్వే కచ్చితంగా రాబోయే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లి ఇవ్వాలా వద్దా అనే విషయాన్ని దృవీకరించడానికే అయ్యి ఉంటుందని పార్టీలో చర్చ జరుగుతున్నది. ఇన్నాళ్లు బీఆర్ఎస్ పార్టీ విస్తరణపై దృష్టి పెట్టిన కేసీఆర్.. తాజాగా రాష్ట్ర ఎన్నికలకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది. సర్వేలు మాత్రమే కాకుండా.. ఇతర మార్గాల ద్వారా కూడా ఎమ్మెల్యేల పని తీరుపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.

First Published:  4 March 2023 2:26 AM GMT
Next Story