Telugu Global
Telangana

అది కేసీఆర్ పుణ్యమే.. కాంగ్రెస్ తప్పు చేస్తోంది

దేశంలో, రాష్ట్రంలో ఆహార ధాన్యాల కొరత లేకుండా చేయాలంటే.. సాగునీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు పోచారం శ్రీనివాసరెడ్డి. ఆహారధాన్యాల కొరత నివారణకోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు చేపట్టిందని గుర్తు చేశారు.

అది కేసీఆర్ పుణ్యమే.. కాంగ్రెస్ తప్పు చేస్తోంది
X

తెలంగాణలో పలు ప్రాజెక్టుల కింద రెండో పంట పండుతుందంటే అది కేసీఆర్‌ పుణ్యమేనని, ఆయన దూరదృష్టి ఫలితమేనని చెప్పారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో సాగునీటిని విడుదల చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతోందని ఆయన ఆరోపించారు. వరి దిగుబడి తగ్గకుండా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టి వ్యవహరిస్తోందన్నారు. నీళ్లు ఉంచుకుని కూడా ఇవ్వకపోతే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని హితవు పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ఉన్న రిజర్వాయర్లలో నీళ్లు ఉన్నాయని, నాగార్జున సాగర్‌ డెడ్‌ స్టోరేజి దాకా ఆ నీటిని వాడుకోవచ్చని ప్రభుత్వానికి సలహా ఇచ్చారు పోచారం.

దేశంలో, రాష్ట్రంలో ఆహార ధాన్యాల కొరత లేకుండా చేయాలంటే.. సాగునీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు పోచారం శ్రీనివాసరెడ్డి. ఆహారధాన్యాల కొరత నివారణకోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు చేపట్టిందని గుర్తు చేశారు. వృథాగా పోతున్న వందల టీఎంసీల నీటి సద్వినియోగానికి.. గోదావరికి అడ్డంగా ప్రాజెక్టులు కట్టామన్నారు. ఈ ప్రాజెక్ట్ ల కారణంగా తెలంగాణలో 30 లక్షల టన్నులుగా ఉన్న వరి ధాన్యం ఉత్పత్తి 2 కోట్ల టన్నులకు పెరిగిందన్నారు. అన్ని వనరులు సద్వినియోగం చేసుకుని పంట దిగుబడి పెంచామని చెప్పారు పోచారం.

కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆరోపణలు చేయడం తప్ప ఆలోచన లేదని ఎద్దేవా చేశారు పోచారం. మహారాష్ట్ర కొయినా ప్రాజెక్టు నుంచి 30 టీఎంసీల నీరు తీసుకురావాలని.. ప్రతిపాదించడం అనాలోచిత చర్య అని మండిపడ్డారు. కొయినా డ్యామ్‌ మనకు 1300 కిలోమీటర్ల దూరంలో ఉందని.. ఆ ప్రాజెక్టు నుంచి నీరు తీసుకోవాలనుకోవడం కాలాన్ని వృథా చేయడమేనన్నారాయన. కాలంతో పాటు నీరు కూడా వృథా అవుతుందని తెలిపారు. తెలంగాణలో వరి దిగుబడి తగ్గితే కాంగ్రెస్‌ ప్రభుత్వమే బాధ్య వహించాలన్నారు పోచారం. గత ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం మాని, రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ సర్కారుకి సూచించారు.

First Published:  12 Jan 2024 12:00 PM GMT
Next Story