Telugu Global
Telangana

"బాణం" తానా అంటే తందానా అంటున్న "తామర పువ్వులు"

తాము వదిలిన "బాణం" తానా అంటే తందానా అంటున్న "తామర పువ్వులు" అంటూ కవిత సింపుల్ గా ఓ ట్వీట్ వేశారు.

బాణం తానా అంటే తందానా అంటున్న తామర పువ్వులు
X

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరెస్ట్, విడుదల.. ఈలోగా జరిగిన హడావిడిపై ఎమ్మెల్సీ కవిత అదిరిపోయే పంచ్ వదిలారు. తాము వదిలిన "బాణం" తానా అంటే తందానా అంటున్న "తామర పువ్వులు". అంటూ ఆమె సింపుల్ గా ఓ ట్వీట్ వేశారు. ఈ ట్వీట్ లో అటు షర్మిలపై, ఇటు బీజేపీపై ఆమె సెటైర్లు పేల్చారు.

జగనన్న కాదు, బీజేపీ వదిలిన బాణం..

గతంలో పాదయాత్ర సమయంలో తాను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకుంటూ జనంలోకి వచ్చారు షర్మిల. ఆ తర్వాత జగన్ ప్రస్తావన లేకుండానే ఆమె ఇప్పుడు వేరు కుంపటి పెట్టుకున్నారు. అయితే ఈ దఫా ఆమె బీజేపీ సపోర్ట్ తో తెలంగాణలో సొంత పార్టీ పెట్టారనే ప్రచారం ఉంది. జగనన్న వదిలిన బాణం కాదు, బీజేపీ వదిలిన బాణం అంటూ షర్మిలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు షర్మిల అరెస్ట్ తర్వాత తెలంగాణలో బీజేపీ నాయకుల స్పందన వారిద్దరి లోపాయికారీ ఒప్పందాన్ని బయటపెట్టిందని ఎద్దేవా చేశారు కవిత.

తానా అంటే తందానా..

తెలంగాణలో షర్మిల యాత్రకు, ఆమె పార్టీ కార్యకలాపాలకు భారీగా ఖర్చవుతోందని, దాన్ని బీజేపీయే భరిస్తోందనే ప్రచారం ఉంది. కేవలం టీఆర్ఎస్ ని ఇబ్బంది పెట్టడానికే తెలంగాణలో బీజేపీ షర్మిలను రంగంలోకి దింపిందని అంటున్నారు. ఇప్పుడు షర్మిల అరెస్ట్ పై బీజేపీ నేతలు స్పందించడంతో ఈ వాదనకు బలం చేకూరింది. ఇదే అంశాన్ని కవిత ప్రస్తావించారు. షర్మిల బీజేపీ వదిలిన బాణం అంటూనే ఆ బాణం తానా అంటే బీజేపీ "తామర పువ్వులు" తందానా అంటున్నాయని మండిపడ్డారు. మొత్తమ్మీద షర్మిల అరెస్ట్ వ్యవహారంతో బీజేపీ-వైఎస్సార్టీపీ మధ్య ఉన్న బంధం బట్టబయలైనట్టయింది.

First Published:  30 Nov 2022 5:30 AM GMT
Next Story