Telugu Global
Telangana

రేపిస్ట్ ల క్షమాభిక్షపై మండిపడ్డ కవిత.. సుప్రీం జోక్యానికి వినతి..

ఐదు నెలల గర్భిణి బిల్కిస్ బానోపై అత్యాచారం చేసి ఆమె మూడేళ్ల చిన్నారిని హత్య చేసిన నిందితులకు గుజరాత్ లోని బీజేపీ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టడం దారుణం అని మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత.

రేపిస్ట్ ల క్షమాభిక్షపై మండిపడ్డ కవిత.. సుప్రీం జోక్యానికి వినతి..
X

ఐదు నెలల గర్భిణి బిల్కిస్ బానోపై అత్యాచారం చేసి ఆమె మూడేళ్ల చిన్నారిని హత్య చేసిన నిందితులకు గుజరాత్ లోని బీజేపీ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టడం దారుణం అని మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత. ఆ దుర్మార్గులు విడుదలైన క్షణాన.. బిల్కిస్ బానో అనుభవించిన బాధ, భయాన్ని ఒక మహిళగా తాను అనుభవించగలను అంటూ భావోద్వేగంతో ట్వీట్ చేశారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.



అత్యాచారం, హత్య వంటి క్రూరమైన నేరాలకు పాల్పడిన నిందితులకు జైలు శిక్ష తగ్గించి క్షమాభిక్ష పెట్టడం, అది కూడా భారత స్వాతంత్ర్య దినోత్సవం రోజున వారిని విడుదల చేయడం దుర్మార్గమని అన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ అనే పేరుకే ఈ ఘటన కలంకంగా మారిందని చెప్పారు. రేపిస్టులు, యావజ్జీవ కారాగార శిక్ష పడిన ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించకూడదనే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను గుజరాత్ ప్రభుత్వం ఉల్లంఘించినట్టేనన్నారు కవిత. గుజరాత్ లోని బీజేపీ ప్రభుత్వం తన అవివేకాన్ని బయటపెట్టుకుందని, ఇది చట్ట వ్యతిరేకమే కాదు, మానవత్వానికి కూడా మాయని మచ్చ అని మండిపడ్డారు.

అది ఇంకా ఘోరం..

రేపిస్ట్ లను విడుదల చేయడమే పెద్ద తప్పు అంటుంటే.. వారికి స్వాగత సత్కారాలు పలకడం ఇంకా క్రూరమైన చర్య అని అన్నారు కవిత. ఇలాంటి స్వాగతాలు సభ్య సమాజానికి ఎలాంటి సందేశాన్నిస్తాయని ప్రశ్నించారు. అత్యంత ప్రమాదకరమైన ఈ సంప్రదాయం వారసత్వంగా మారకుముందే దానికి అడ్డుకట్ట వేయడం అత్యవసరం అన్నారామె. పౌరులు చట్టంపై విశ్వాసం కోల్పోకుండా ఉండాలంటే, బిల్కిస్ బానో అనుభవించిన బాధను ఇతర ఏ మహిళా అనుభవించకూడదనుకుంటే.. ఈ దుర్మార్గమైన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారామె. మరోసారి ఇలాంటి చర్యలను ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకుండా సుప్రీంకోర్టు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

First Published:  18 Aug 2022 8:15 AM GMT
Next Story