Telugu Global
Telangana

కర్ణాటక ప్రభుత్వం పొలిటికల్ ఎలక్షన్ ట్యాక్స్ వసూలు చేస్తోంది : మంత్రి కేటీఆర్

కాంగ్రెస్‌ను ఇప్పుడు అందరూ 'స్కామ్‌గ్రెస్' అనే కొత్త పేరు పెట్టి పిలుస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

కర్ణాటక ప్రభుత్వం పొలిటికల్ ఎలక్షన్ ట్యాక్స్ వసూలు చేస్తోంది : మంత్రి కేటీఆర్
X

కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో 'పొలిటికల్ ఎలక్షన్ ట్యాక్స్'ను వసూలు చేస్తోందని అన్నారు. బెంగళూరు నగరంలో బిల్డర్ల నుంచి చదరపు అడుగుకు రూ.500ను అదనంగా వసూలు చేస్తోందని ఆరోపించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్‌కు ఆర్థికంగా సహాయం చేయడానికే ఈ వసూళ్లకు పాల్పడుతోందని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు శనివారం ఎక్స్(ట్విట్టర్)లో పలు ఆరోపణలు చేశారు.

గ్రాండ్ ఓల్డ్ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్‌కు పాత అలవాట్లు పోలేదు. స్కాములు చేసే వారి వారసత్వాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. అందుకే కాంగ్రెస్‌ను ఇప్పుడు అందరూ 'స్కామ్‌గ్రెస్' అనే కొత్త పేరు పెట్టి పిలుస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎంత డబ్బును కుమ్మరించినా తెలంగాణ ప్రజలు అపహాస్యం కావడానికి సిద్ధంగా లేరని చెప్పారు. తెలంగాణలో స్కామ్‌గ్రెస్‌కు నో చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

తెలంగాణ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక డిప్యుటీ సీఎం శివకుమార్ బాధ్యుడిగా ఉన్నారు. చేరికల నుంచి టికెట్ల వరకు అంతా బెంగళూరు వేదికగానే అధిష్టానం ఖరారు చేస్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌లో ఎవరు చేరాలన్నా.. ముందు బెంగళూరు వెళ్లి డీకే శివకుమార్ ఆశీస్సులు తీసుకోవలసి వస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా కీలకమైన నిర్ణయాలు డీకే శివకుమార్‌ను అడిగే తీసుకుంటున్నారు.

ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ జుట్టు మొత్తం బెంగళూరులోని డీకే చేతిలో ఉన్నది. గతంలో రాజస్థాన్ ఎన్నికల సమయంలో కూడా డీకే శివకుమార్ భారీగా డబ్బు సమకూర్చినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు కర్ణాటకలో అధికారంలో ఉండటంతో తెలంగాణ ఎన్నికల కోసం డీకేనే ఆర్థిక అండ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సంచలన ఆరోపణలు చేసినట్లు చర్చ జరుగుతోంది.


First Published:  30 Sep 2023 4:15 AM GMT
Next Story