Telugu Global
Telangana

తెలంగాణలో కర్ణాటక ఫార్ములా.. కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన!

బీజేపీని పక్కకు పెట్టి బీఆర్ఎస్‌కు ప్రధాన పోటీదారుగా నిలవాలంటే సంక్షేమ పథకాలనే నమ్ముకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.

తెలంగాణలో కర్ణాటక ఫార్ములా.. కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన!
X

కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి నూతన ఉత్సాహాన్ని తీసుకొని వచ్చింది. దక్షిణాదిన పార్టీ మనుగడే ప్రశ్నార్థకం అయిన సమయంలో కర్ణాటక ఫలితాలు కొత్త ఊపిరిలూదింది. బీజేపీ విద్వేష, విభజన, మతతత్వ రాజకీయాలకు విరుగుడుగా.. కాంగ్రెస్ ప్రజల ముందు పెట్టిన సంక్షేమ ఫార్ములా విజయం సాధించిందని అధిష్టానం భావిస్తోంది. ఒక వర్గం వారిని బీజేపీ టార్గెట్ చేస్తోందని ప్రజలకు వివరించడంలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇప్పుడు ఇదే ఫార్ములాను రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఉపయోగించాలని అధిష్టానం భావిస్తోంది.

కర్ణాటకలో విద్వేష రాజకీయాలను తిప్పి కొట్టి సంక్షేమానికి ప్రజలు జై కొట్టారు. తెలంగాణలో బీజేపీ ఇంకా విభజన, మతతత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తోంది. బీజేపీని పక్కకు పెట్టి బీఆర్ఎస్‌కు ప్రధాన పోటీదారుగా నిలవాలంటే సంక్షేమ పథకాలనే నమ్ముకోవాలని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నది. దీంతో వాటికి మించి ఇంకేం చేయగలమో ఆలోచించాలని ఇప్పటికే రాష్ట్ర నాయకత్వానికి అధిష్టానం సూచించింది. అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల విషయంలో తగిన సూచనలు చేయాలని అధిష్టానం కోరింది.

తెలంగాణలో మేము సంక్షేమం, అభివృద్ధి అనే అంశాలనే ఎన్నికల ప్రచారంలో పెడతామని ఏఐసీసీ మీడియా సెల్ చైర్మన్ పవన్ ఖేరా అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే సంక్షేమ పథకాలను నమ్ముకోక తప్పదని ఆయన చెబుతున్నారు. రాబోయే ఎన్నికల్లో తప్పకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందని ఆయన చెబుతున్నారు. దక్షిణాదిన మతతత్వ రాజకీయాలు పని చేయవనే విషయం కర్ణాటక ఎన్నికల ఫలితాల ద్వారా స్పష్టమైందని తెలిపారు.

త్వరలోనే టీపీసీసీ సమావేశాన్ని ఏర్పాటు చేసి.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోపై చర్చించే అవకాశం ఉందని ఖేరా తెలిపారు. అలాగే కాంగ్రెస్‌ను వీడి ఇతర పార్టీల్లోకి వెళ్లిన వారిని తిరిగి పార్టీలోకి తీసుకొని వచ్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. కర్ణాటక ఫలితాల తర్వాత పార్టీని వీడిన నాయకులు తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

కర్ణాటకలో ఎలాగైనే అందరినీ ఒక్క తాటిపైకి తెచ్చి ఎన్నికల బరిలోకి దిగామో... తెలంగాణలో కూడా పార్టీని ఐక్యం చేసేందుకు అధిష్టానం చర్యలు ప్రారంభించిందని చెప్పారు. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా ఎన్నికలకు అందరూ కలిసి కట్టుగా పని చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన చెప్పారు.

First Published:  17 May 2023 5:43 AM GMT
Next Story