Telugu Global
Telangana

కేసీఆర్ పాలనపై కర్నాటక మాజీ సీఎం ప్రశంసలు..

కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌.. కర్నాటక నుంచి తెలంగాణకు వెళ్లి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు కుమారస్వామి. కర్నాటకలో ఐదు గంటల కరెంటు ఇస్తున్నామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారని, కానీ కేవలం 2 గంటల కరెంటే ఇస్తున్నారని ఆరోపించారు.

కేసీఆర్ పాలనపై కర్నాటక మాజీ సీఎం ప్రశంసలు..
X

తెలంగాణలో కాంగ్రెస్ తరపున కర్నాటక స్వరాలు బాగానే ప్రచారం చేస్తున్నాయి. వీటికి ధీటుగా అదే కర్నాటక నుంచి బీఆర్ఎస్ కి మద్దతుగా మాట్లాడారు మాజీ సీఎం కుమారస్వామి. కర్నాటకలో కాంగ్రెస్ విఫలం అయిందని, ఐదు గ్యారెంటీలు అమలు చేయడానికే ఆపసోపాలు పడుతోందని, ఇప్పుడు తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి కూడా ఆ పార్టీ బయలుదేరిందని ఎద్దేవా చేశారు. ఐదు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. ఆ ఐదు గ్యారెంటీలతో పేదలకు ఒరిగిందేమీ లేదన్నారు కుమారస్వామి.

ఇక్కడినుంచి వెళ్లి అక్కడ అబద్ధాలు..

కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌.. కర్నాటక నుంచి తెలంగాణకు వెళ్లి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు కుమారస్వామి. కర్నాటకలో ఐదు గంటల కరెంటు ఇస్తున్నామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారని, కానీ కేవలం 2 గంటల కరెంటే ఇస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షంగా ఉందన్నారు కుమారస్వామి. ఆ రాష్ట్రంలో రైతుబంధుతో అన్నదాతలను ఆదుకుంటున్నారని ప్రశంసించారు. ఇప్పటివరకు రూ.73 వేల కోట్లను రైతుల ఖాతాల్లో వేశారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఎకరానికి రూ.15 వేలు రైతుబంధు ఇస్తామని మాయమాటలు చెబుతోందని విమర్శించారు. కాంగ్రెస్‌ కు మభ్యపెట్టి ఓట్లు దండుకోవడమే తెలుసని, కాంగ్రెస్‌ దగాకోరు వైఖరిని, నయవంచనను అందరూ గుర్తించాలని ఆయన కోరారు.

కేసీఆర్‌ రైతుబంధు పథకాన్ని బీజేపీ కాపీ కొట్టిందని కుమారస్వామి ఎద్దేవా చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ అక్కడి రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్నారని, కర్నాటకలో ఎప్పుడూ సరిగా కరెంటు ఉండటం లేదని విమర్శించారు. కర్నాటకలో చేయలేని పనులను కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

First Published:  12 Nov 2023 1:02 PM GMT
Next Story