Telugu Global
Telangana

మింగలేక, కక్కలేక.. బండి మార్కు విశ్లేషణ

తెలంగాణ బీజేపీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఆ ఫలితాలకు, ఈ ఫలితాలకు పోలిక ఉండదంటున్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.

మింగలేక, కక్కలేక.. బండి మార్కు విశ్లేషణ
X

కర్నాటక ఎన్నికల ఫలితాలు బీజేపీకి పెద్ద షాకిచ్చాయి. అసలీ ఫలితాలను ఎలా విశ్లేషించాలి అనే విషయంపై బీజేపీ నాయకుల పరిస్థితి మింగలేక, కక్కలేక అన్నట్టుగా ఉంది. అందులోనూ తెలంగాణలో కూడా ఇదే ఏడాది అసెంబ్లీ ఎన్నికలున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో కూడా కర్నాటక ఫలితాలు రిపీట్ అవుతాయంటూ కాంగ్రెస్ నేతలు గట్టిగా చెబుతున్నారు. ఈ దశలో తెలంగాణ బీజేపీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఆ ఫలితాలకు, ఈ ఫలితాలకు పోలిక ఉండదంటున్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.

మా బలం తగ్గలేదు..

ఏ రాష్ట్రంలోనైనా అక్కడి పరిస్థితుల ప్రభావం ఉంటుందని, కర్నాటకలో బీజేపీ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదని చెప్పారు బండి సంజయ్. ఒక రాష్ట్రంలో వచ్చిన ఫలితాల ప్రభావం మరో రాష్ట్రంపై ఉంటుందనుకోవడం సరికాదన్నారు. గత ఎన్నికల్లో కర్నాటకలో బీజేపీకి 36 శాతం ఓట్లు వచ్చాయని, ఈసారి కూడా 36శాతం ఓట్లు పోలయ్యాయని కవర్ చేసుకున్నారు. తమ బలం తగ్గలేదన్నానరు. కాంగ్రెస్‌ పార్టీ ఓటింగ్‌ 38 నుంచి 43 శాతానికి పెరిగిందన్నారు. జేడీఎస్‌ ఓటింగ్‌ షేర్‌ 20 నుంచి 13శాతానికి తగ్గిందని అన్నారు. మొత్తమ్మీద కర్నాటకలో తమ పార్టీ బలం తగ్గలేదని వివరణ ఇచ్చుకుంటున్నారు బండి సంజయ్.

అన్ని పార్టీలు కలసి కర్నాటకలో బీజేపీని ఎదుర్కొన్నాయని చెప్పారు బండి సంజయ్. కర్నాటకలో మత రాజకీయాలు చేసింది బీజేపీ కాదని కాంగ్రెస్సేనని విశ్లేషించారు. మరోవైపు తెలంగాణతో ఈ ఎన్నికల ఫలితాలను ముడిపెట్టలేమన్నారు బండి సంజయ్. తెలంగాణలో 5 ఉప ఎన్నికలు జరిగితే రెండింటిలో బీజేపీ గెలిచిందని గుర్తు చేశారు. మునుగోడులో కూడా తామే గెలిచినట్టు లెక్క అన్నారు బండి. కాంగ్రెస్ కి డిపాజిట్లు రాలేదన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కి అంత సీన్ లేదని లెక్కగట్టారు. ఒక రాష్ట్రంలో గెలవగానే కేంద్రంలో అధికారంలోకి వస్తారా అని ప్రశ్నించారు బండి సంజయ్. తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రావడం ఖాయమన్నారు.

First Published:  13 May 2023 1:23 PM GMT
Next Story