Telugu Global
Telangana

కర్ణాటక ఎన్నికల ఫలితం.. రెండుగా విడిపోయిన తెలంగాణ బీజేపీ?

ఉత్తరాదిన చేసినట్లు దక్షిణాదిన మతపరమైన రాజకీయాలు వర్క్ అవుట్ కావనే విషయం కర్ణాటక ఎన్నికల ద్వారా స్పష్టమైంది.

కర్ణాటక ఎన్నికల ఫలితం.. రెండుగా విడిపోయిన తెలంగాణ బీజేపీ?
X

తెలంగాణ బీజేపీలో వర్గ విభేదాలు మరింతగా పెరిగిగాయి. మొదటి నుంచి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వర్గానికి.. ఇతర పార్టీల నుంచి చేరిన నాయకులకు మధ్య సఖ్యత సరిగా లేదు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఈ రెండు వర్గాల మధ్య మరింత దూరం పెరిగినట్లు తెలుస్తున్నది. మరి కొన్ని వారాల్లోనే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సమయంలో తెలంగాణ బీజేపీ ఏ స్టాండ్ తీసుకోవాలనే విషయంలో ఇరు వర్గాలు వాదోపవాదాలు చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది.

కర్ణాటక ఎన్నికల సమయంలో అక్కడి బీజేపీ బలమైన హిందుత్వ స్టాండ్ తీసుకున్నది. ఎప్పటిలాగానే మతపరమైన వ్యాఖ్యలతో ప్రజల మధ్య మనోభావాలు రెచ్చగొట్టి లబ్ది పొందాలని జాతీయ నాయకత్వం కూడా భావించింది. కానీ కర్ణాటక ప్రజలు బీజేపీని తిరస్కరించి.. కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పేరుతో వెళ్లిన కాంగ్రెస్‌కు జై కొట్టడంతో బీజేపీ హిందుత్వ అజెండాపై అనుమానాలు మొదలయ్యాయి.

తెలంగాణలో కూడా బీజేపీ రూట్ మార్చాల్సిన అవసరం ఉందని పలువురు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక్కడ బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ నాయకత్వాన్ని ఢీ కొట్టాలంటే హిందుత్వ అజెండాతో వెళ్లడం సరి కాదని ఒక వర్గం నాయకులు వాదిస్తున్నారు. అదే సమయంలో బండి సంజయ్, అతని అనుచరులు మాత్రం హిందుత్వ అజెండానే ఫాలో అవ్వాలని పట్టుబడుతున్నారు. ఉత్తరాదిన చేసినట్లు దక్షిణాదిన మతపరమైన రాజకీయాలు వర్క్ అవుట్ కావనే విషయం కర్ణాటక ఎన్నికల ద్వారా స్పష్టమైంది. అయినా సరే తెలంగాణలో అదే రూట్లో వెళ్తామని అనడం ఆత్మహత్యసదృశ్యం అవుతుందని మరో వర్గం వాదిస్తోంది.

బీజేపీ చీఫ్ బండి సంజయ్ చాన్నాళ్లుగా కొత్త సచివాలయంపై విమర్శలు చేస్తున్నారు. సచివాలయం పైన ఉన్న డోమ్స్ ఒక వర్గానికి ప్రతీకగా ఉన్నాయని, తాము అధికారంలోకి వస్తే సచివాలయాన్ని కూల్చేస్తామని చెబుతున్నారు. అయితే, తెలంగాణ ప్రజలు మాత్రం ఆయన మాటలను ఏ మాత్రం లెక్కచేయడం లేదు. పైగా కొత్తగా కట్టిన సచివాలయాన్ని కూల్చేస్తాననడం బీజేపీకే మైనస్‌గా మారుతున్నది. ఈ విషయం గ్రహించిన కొంత మంది బీజేపీ నాయకులు.. ఇలా మతపరమైన సెంటిమెంట్లను అడ్డు పెట్టుకొని వెళ్తే మొదటికే మోసం వస్తుందని సూచిస్తున్నారు.

తెలంగాణ బీజేపీలో ఇలా రెండు వర్గాలుగా విడిపోయి.. ఏ స్ట్రాటజీతో ముందుకు వెళ్లాలనే విషయంలో వాదించుకుంటున్నారు. బీజేపీ అధిష్టానం కూడా తెలంగాణలో ఎలా ముందుకు వెళ్లాలనే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నది. కర్ణాటక లాగానే హిందుత్వ అజెండాతో వెళ్లాలా.. లేదంటే వేరే స్ట్రాటజీ అవలంభించాలా అనే విషయంలో తర్జనభర్జన పడుతోంది. రాబోయే 30 రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయంలో బీజేపీ ఏ స్టాండ్ తీసుకోవాలనే విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. మే 22, 23న రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో అసెంబ్లీ ఎన్నికలే కీలక అంశంగా ఉండనున్నది. ఆ సమావేశంలో ఈ విషయం తప్పకుండా చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

First Published:  17 May 2023 2:34 AM GMT
Next Story