Telugu Global
Telangana

మరోసారి సెంటిమెంట్‌ను నమ్ముకున్న కేసీఆర్.. అక్కడి నుంచే జాతీయ శంఖారావం

ఈ నెల 5న పార్టీ ప్రకటన తర్వాత తనకు కలసి వచ్చే కరీంనగర్ వేదికగా జాతీయ పార్టీ ప్రచారాన్ని ప్రారంభించాలని కేసీఆర్ భావిస్తున్నారు. అక్కడి నుంచే ఎన్నికల శంఖారావం పూరించాలని అనుకుంటున్నారు.

మరోసారి సెంటిమెంట్‌ను నమ్ముకున్న కేసీఆర్.. అక్కడి నుంచే జాతీయ శంఖారావం
X

సామాన్య ప్రజలకే కాకుండా రాజకీయ నాయకులకు కూడా సెంటిమెంట్లు ఎక్కువగానే ఉంటాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఏ పని చేసినా అప్పట్లో చేవెళ్ల నుంచి ప్రారంభించేవాళ్లు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇడుపులపాయ సెంటిమెంట్ ఉంది. తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ కూడా సెంటిమెంట్లను బాగానే నమ్ముతారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఏ ముఖ్యమైన పని తలపెట్టినా ముహూర్తంతో పాటు స్థాన బలాన్ని కూడా విశ్వసిస్తూ వచ్చారు. తాజాగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్న కేసీఆర్.. తన పార్టీ ప్రకటన నుంచి ప్రచారం వరకు ప్రతీ విషయంలో సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు.

Advertisement

తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్‌కు కరీంనగర్ ఓ సెంటిమెంట్‌గా ఉంది. సిద్ధిపేట నుంచి ఎమ్మెల్యేగా వరుసగా ఎన్నికవుతూ వచ్చిన కేసీఆర్.. టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత ప్రత్యేక రాష్ట్ర విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన తొలిసారి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి కరీంనగర్ లోక్‌సభను ఎంచుకున్నారు. అక్కడి నుంచి 2004లో పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత తెలంగాణ కోసం రెండు సార్లు రాజీనామా చేసి ఉపఎన్నికలో కరీంనగర్ నుంచే గెలిచారు. 2008లో వచ్చిన ఉప ఎన్నికలో కేసీఆర్‌ను ఓడించడానికి అప్పటి సీఎం వైఎస్ఆర్ ఎన్నో వ్యూహాలు రచించారు. అప్పటి వరకు లక్షకు పైగా మెజార్టీతో గెలుస్తూ వచ్చిన కేసీఆర్.. 2008లో మాత్రం 15 వేల పైచిలుకు ఓట్లతో గెలిచారు. అయినా సరే కరీంనగర్ ప్రజలు తనను వరుసగా గెలిపిస్తూ వచ్చినందుకు ఇప్పటికీ కేసీఆర్ అదే విషయాన్ని బహిరంగ సభల్లో చెబుతుంటారు.

Advertisement

తాను ఏ పని చేపట్టినా కరీంనగర్ నుంచే ప్రారంభిస్తానని.. తనకు కరీంనగర్ అంటే సెంటిమెంట్ అని.. ఇక్కడి ప్రజలు తనను ఎంతగానో ఆదరిస్తారని చెప్తుంటారు. ఇక ఇప్పుడు జాతీయ రాజకీయాల విషయంలో కూడా కరీంనగర్‌నే నమ్ముకున్నారు. ఈ నెల 5న పార్టీ ప్రకటన తర్వాత తనకు కలసి వచ్చే కరీంనగర్ వేదికగా జాతీయ పార్టీ ప్రచారాన్ని ప్రారంభించాలని భావిస్తున్నారు. అక్కడి నుంచే ఎన్నికల శంఖారావం పూరించాలని అనుకుంటున్నారు. దేశవ్యాప్తంగా జాతీయ పార్టీని పరిచయం చేయడానికి ఉత్తరాదిన రెండు భారీ సభలు పెట్టే ముందు కరీంనగర్ వేదికగా పర్యటనలు ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

జాతీయ పార్టీకి సంబంధించిన కీలక విషయాలు చర్చించడానికి మంత్రులు, 33 జిల్లాల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులతో ఆదివారం ప్రగతిభవన్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. దసరా రోజు పార్టీని ప్రకటించడానికి ఇప్పటికే ముహూర్తం ఖరారు చేశారు. తాజా సమావేశంలో ఎక్కడెక్కడ పార్టీ సభలు నిర్వహించాలనే విషయాన్ని కూడా చర్చించనున్నారు. కరీంనగర్ సభ తర్వాత మహారాష్ట్రలో మరో సభ పెట్టనున్నారు. ఆ తర్వాత యూపీ, బీహార్, పంజాబ్‌లో పార్టీ ప్రచారాన్ని ముందుకు తీసుకొని వెళ్లనున్నారు.

Next Story