Telugu Global
Telangana

కంటి వెలుగు: రెండో దశలో ఇప్పటి వరకు 33.6 లక్షల మందికి కంటి పరీక్షలు

కంటివెలుగు రెండో దశ కంటి పరీక్షల నిర్వహణ ప్రపంచ రికార్డు సృష్టించేందుకు దోహదపడుతుందని వైద్య, ఆరోగ్య శాఖ సీనియర్ అధికారులు భావిస్తున్నారు.

కంటి వెలుగు: రెండో దశలో ఇప్పటి వరకు 33.6 లక్షల మందికి కంటి పరీక్షలు
X

నల్గొండ పట్టణానికి సమీపంలోని భాస్కర్ల బావికి చెందిన మేరోళ్ల మురళి అనే టైలర్ కంటి చూపు సరిగా లేకపోవడంతో రెండు, మూడు గంటలకన్నా ఎక్కువ పనిచేయలేకపోతున్నాడు. దీంతో అతనికి ఆదాయం సరిగా రాక కుటుంబానికి పూటగడవడం కష్టంగామారింది. సమీపంలోని నల్గొండ పట్టణానికి వెళ్ళి నేత్ర వైద్యునితో టెస్ట్ చేయించుకునే స్థోమత కూడా అతనికి లేదు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం రెండో దశ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రకటించింది.

గత వారం మురళి తన గ్రామంలో ఏర్పాటు చేసిన నేత్ర వైద్య శిబిరానికి వెళ్లి పరీక్షలు చేయించుకున్న అనంతరం అక్కడికక్కడే 2.5 పాయింట్ల పవర్ ఉన్న రీడింగ్ గ్లాస్‌ను అందించారు. తాను ఇప్పుడు 10 గంటల పాటు టైలరింగ్ పనులు చేస్తూ సంతోషంగా ఉన్నానని, కంటి వెలుగు ప్రారంభించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

కంటి వెలుగు ద్వారా లబ్ధి పొందిన సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి గ్రామానికి చెందిన పలువురు రైతు కూలీల్లో చంద్రకళ ఒకరు. కంటిచూపు సరిగా లేకపోవడంతో ఆమె వ్యవసాయ పనులకు వెళ్లలేక ఇబ్బంది పడుతున్నది. మురళి లాగే ఆమెకు కూడా ఆసుపత్రికి వెళ్లే స్తోమత లేదు. కానీ ఉచిత కంటి వెలుగు కంటి శిబిరాల వల్ల ఆమె జీవితం కూడా మారిపోయింది.

"కంటి వెలుగు నాకు కొత్త చూపును ఇచ్చింది. నా కుటుంబాన్ని చూసుకోవడానికి కొత్త శక్తిని ఇచ్చింది" అని ఆమె తన కొత్త కళ్లద్దాలను చూపిస్తూ చెప్పింది.

రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం ద్వారా లబ్ది పొందిన లక్షలాది మందిలో మురళి, చంద్రకళ ఒకరు. కంటివెలుగు రెండో దశ కంటి పరీక్షల నిర్వహణ ప్రపంచ రికార్డు సృష్టించేందుకు దోహదపడుతుందని వైద్య, ఆరోగ్య శాఖ సీనియర్ అధికారులు భావిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 33,60,301 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 6,76,732 మందికి కళ్లద్దాలు ఇచ్చారు.

కంటి వెలుగు 2.0 ఇప్పటివరకు:

* మొత్తం కంటి పరీక్షలు: 33,60,301

* రీడింగ్ గ్లాసెస్ మొత్తం పంపిణీ: 6,76,732

* ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ కోసం సూచన: 4,60,775

* కంటి సమస్యలు లేనివారు: 22,22,669 మంది

First Published:  12 Feb 2023 1:52 AM GMT
Next Story