Telugu Global
Telangana

కమ్మలకు సై.. బీసీలకు నై.. కాంగ్రెస్‌లో కులాల కుంపటి!

ఢిల్లీ వెళ్లిన కమ్మ ఐక్య వేదిక నేతలకు అడిగిన వెంటనే అపాయింట్‌మెంట్ ఇచ్చారు కాంగ్రెస్ పెద్దలు. కానీ, బీసీ నేతలకు మాత్రం హై కమాండ్ అపాయింట్‌మెంట్ దొరకలేదు.

కమ్మలకు సై.. బీసీలకు నై.. కాంగ్రెస్‌లో కులాల కుంపటి!
X

ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ కాంగ్రెస్‌లో కులాల కుంపటి రాజుకుంది. ఇప్పటికే తమకు దక్కాల్సిన వాటా మేరకు సీట్లు ఇవ్వాలని బీసీలు కోరుతుంటే.. జనరల్ సీట్లలోనూ అవకాశం ఇవ్వాలని ఎస్సీ, ఎస్టీలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు కమ్మ నేతలు సైతం హైకమాండ్‌తో అమీతుమీకి సిద్ధమయ్యారు. పది అసెంబ్లీ స్థానాలతో పాటు రెండు లోక్‌సభ స్థానాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అడిగినన్ని సీట్లు ఇవ్వకుంటే ప్లాన్-బీ అమలు చేస్తామంటూ హైకమాండ్‌కు అల్టిమేటం కూడా జారీ చేశారు. అయితే ప్లాన్‌-బీ ఏంటన్నది పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

ఇక్కడే మరో వివాదం వచ్చి పడింది. ఢిల్లీ వెళ్లిన కమ్మ ఐక్య వేదిక నేతలకు అడిగిన వెంటనే అపాయింట్‌మెంట్ ఇచ్చారు కాంగ్రెస్ పెద్దలు. కమ్మ నేతలతో కేసీ వేణుగోపాల్ చర్చలు జరిపారు. తర్వాత ఏఐసీసీ చీఫ్‌ మల్లిఖార్జున ఖర్గేతోనూ కమ్మ ఐక్య వేదిక నేతలు సమావేశమయ్యారు. కానీ, బీసీ నేతలకు మాత్రం హై కమాండ్ అపాయింట్‌మెంట్ దొరకలేదు. బీసీలకు వాటా ప్రకారం సీట్లివ్వాలని కోరిన నేతలు.. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రకటించిన సీట్లయినా ఇవ్వాలని కోరుతున్నారు. అవీ కూడా ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో హైకమాండ్‌తో తేల్చుకునేందుకు ఢిల్లీ వెళ్లారు. రాహుల్ గాంధీ, ఖర్గేను కలిసి రిప్రజంటేషన్ ఇచ్చేందుకు అపాయింట్‌మెంట్ కోరారు. హస్తినలో దాదాపు 5 రోజులు బీసీ నేతలు వేచి చూశారు. చివరికి కేసీ వేణుగోపాల్‌, మురళీధరన్‌తో మాత్రమే సమావేశమయ్యారు తప్ప ఖర్గేను మాత్రం కలవలేకపోయారు. పైగా కేసీ వేణుగోపాల్‌ పలువురు బీసీ సీనియర్ నేతలకు చీవాట్లు పెట్టినట్లు సమాచారం. దీంతో తమను ఐదు రోజులు వేచి చూసేలా చేసి.. కమ్మ కుల నాయకులకు మాత్రం అడిగిన వెంటనే అపాయింట్‌మెంట్ ఇవ్వడాన్ని పలుపురు బీసీ నాయకులు తప్పుపడుతున్నారు.

బీసీలకు పార్లమెంట్‌కు రెండు చొప్పున 34 సీట్లిస్తామని హామీ ఇచ్చినా.. రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు మాత్రం అందుకు సిద్ధంగా లేరని పలువురు బీసీ నేతలు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గెలుపు గుర్రాలు, సర్వేల పేరుతో బీసీలకు అన్యాయం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు. రాహుల్‌, ఖర్గే వైఖరికి పూర్తి భిన్నంగా రాష్ట్ర నాయకత్వం నడుచుకుంటోందంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీకి తీవ్ర నష్టం తప్పదని బీసీ లీడర్లు హెచ్చరిస్తున్నారు.

First Published:  8 Oct 2023 5:25 AM GMT
Next Story