Telugu Global
Telangana

అన్నబాటలో చెల్లె

చేనేతపై జీఎస్టీని ఎత్తివేయాలని కల్వకుంట్ల కవిత ప్రధాని మోడీని డిమాండ్ చేశారు.ఈ మేరకు ఆమె ప్రధానికి పోస్ట్ కార్డు రాశారు. చేనేతను ప్రోత్సహించే బదులు దానిపై జీఎస్టీ విధించడం దేశాభివృద్ధికి విరుద్ధమని, అందుకే మన చేనేత పరిశ్రమను ఆదుకోవాలని అన్న కేటీఆర్ ఇచ్చిన పిలుపుకు స్పందనగా తాను కూడా ఈ పోస్ట్ కార్డు ఉద్యమంలో చేరానని ట్విట్టర్ లో ఆమె కామెంట్ చేశారు.

అన్నబాటలో చెల్లె
X

చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రధానిమోడీకి లక్షలాదిగా పోస్టు కార్డులు రాయాలని పిలుపునిచ్చిన కేటీఆర్ తాను కూడా స్వయంగా పోస్టు కార్డు రాసిన నేపథ్యంలో, అన్న బాటలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా పోస్ట్ కార్డు రాశారు. ఆమె తాను రాసిన కార్డును ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

''మన చేనేత పరిశ్రమ మన సుసంపన్నమైన వారసత్వం, సంస్కృతికి సజీవ సాక్ష్యం, మన దేశ వైవిధ్యానికి అదొక గుర్తు.

చేనేతను ప్రోత్సహించే బదులు దానిపై జీఎస్టీ విధించడం దేశాభివృద్ధికి విరుద్ధం. అందుకే మన చేనేత పరిశ్రమను ఆదుకోవాలని అన్న కేటీఆర్ ఇచ్చిన పిలుపుకు స్పందనగా నేను కూడా ఈ పోస్ట్ కార్డు ఉద్యమంలో చేరాను'' అని ట్విట్టర్ లో కామెంట్ చేశారు.

చేనేత వస్త్రాలు, చేనేత ఉత్పత్తులపై ఉన్న ఐదు శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని ఆమె ప్రధానిని తన లేఖలో కోరారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చేనేత పై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడం సరైంది కాదని ఆమె తన లేఖ‌లో పేర్కొన్నారు.

ఇది దేశంలోని కోట్లాది పేద చేనేత కార్మికుల జీవితాల సమస్య అని, అందువల్ల‌ చేనేత సంబంధ వస్తువులపై విధిస్తున్న జీఎస్టీని పూర్తిగా తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ 5 నుండి12 శాతం పెంచడానికి మోడీ సర్కార్ కుట్ర పన్నుతోందని, ఇది దేశంలో చేనేతను పూర్తిగా నాశనం చేస్తుందన్నారు కవిత. ఈ దేశంలో గొప్ప చరిత్రగల చేనేతను కాపాడాలంటే జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలని ఆమె అన్నారు.

మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ప్రధానికి ఈ విషయమై పోస్ట్‌ కార్డ్‌ రాయాలని, చేనేతపై జీఎస్టీ ఎత్తివేసేంత వరకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


First Published:  23 Oct 2022 1:58 PM GMT
Next Story