Telugu Global
Telangana

కాళేశ్వరం ప్రాజెక్టు.... నిజాలు, అబద్దాలు

కాళేశ్వరం ప్రాజెక్టు పై ఈ మధ్య కేంద్రం మంత్రులు, బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణల్లో నిజాలున్నాయా ? ఒకప్పుడు ఈ ప్రాజెక్టును ఇంజనీరింగ్ అద్భుతమని పొగిడిన కేంద్రం ఇప్పుడు మాట ఎందుకు మార్చింది?

కాళేశ్వరం ప్రాజెక్టు.... నిజాలు, అబద్దాలు
X

ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈ మధ్య కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు మాట్లాడుతున్న తీరు అనేక అయోమయాలను సృష్టిస్తోంది. కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే కేంద్రానికి తెలియకుండానే, కేంద్ర సంస్థల అనుమతులు లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారేమో అనే అనుమానం వచ్చే అవకాశం ఉన్నది.

ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ప్రకటన చేశారు. సీతారామన్ దానిపై మూడు నిర్దిష్ట అంశాలను చెప్పారు:

ఎ) ప్రాజెక్ట్ నిర్మాణం కోసం బ్యాంకుల నుండి సంవత్సరానికి 8.25 శాతం నుండి 10.9% వరకు అధిక వడ్డీ రేటుతో అప్పులు తీసుకున్నారు.

బి) ప్రాజెక్ట్ చాలా అధ్వాన్నంగా ఉంది, దాని నీటి పంపులను కూడా సరిగ్గా నడపడంలేదు.

సి) వివరణాత్మక ప్రాజెక్ట్ రిపోర్ట్, డిపిఆర్ తయారు చేయకుండానే ప్రాజెక్ట్ గ్రౌండ్ చేయబడింది. దీంతో ప్రాజెక్టు వ్యయం రూ.40,000 కోట్ల నుంచి రూ.1.40 లక్షల కోట్లకు పెరిగింది.

నిర్మలా సీతారామన్ ప్రసంగానికి సరిగ్గా 20 రోజుల ముందు, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, "ప్రాజెక్ట్‌కు చట్టబద్ధమైన అనుమతులు లేవు. డిజైన్లు సాంకేతికంగా లోపభూయిష్టంగా ఉన్నాయి, దీని కారణంగా KLIS యొక్క మూడు బ్యారేజీలలోని పంప్ హౌస్‌లు ఇటీవలి భారీ వర్షాలకు మునిగిపోయాయి. ." అని అన్నారు.

ఈ మాటల్లోని నిజా నిజాల చర్చలోకి పోకుండా అసలు ప్రాజెక్టు గురించి గతంలో వాళ్ళకేమీ తెలియనట్టు, ఇప్పుడే కొత్తగా తెలుసుకుంటున్నట్టు. ఆ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులే ఇవ్వనట్టు వారు మాట్లాడుతున్న తీరు గురించి ఒక్క సారి చూద్దాం.

2014 లో ఈ ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సహా దేశంలోని బీజేపీ నాయకులంతా దీన్ని ఆకాశానికెత్తారు. గవర్నర్లు ప్రాజెక్టును పొగడ్తలతో ముంచెత్తారు. కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న బ్యాంకులు తెలంగాణ మరో కోనసీమ కాబోతుందని ప్రకటనలు గుప్పించాయి.

కాళేశ్వరం ప్రాజెక్ట్, ఒక దశలో, 'తప్పక సందర్శించాల్సిన' సైట్‌గా మారింది. దేశ వ్యాప్తంగా ఉన్న అనేక మంది సాంకేతిక నిపుణులు, రాజకీయ నాయకులు, గవర్నర్లు, విదేశీ ప్రముఖులు తరచూ సందర్శించేవారు. జూన్ 21, 2019న ప్రాజెక్ట్ యొక్క ఒక విభాగాన్ని ప్రారంభించినప్పుడు, అప్పటి గవర్నర్ నరసింహన్, అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.

గవర్నర్ నరసింహన్ ఈ ప్రాజెక్ట్ సైట్ ను అనేక సార్లు సందర్శించారు. ఈ ప్రాజెక్ట్ "అద్భుతమైనది, అపూర్వమైనది" అని బహిరంగంగా వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను ప్రశంసిస్తూ, "ఆయన కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కాదు కాళేశ్వరం చంద్రశేఖర్ రావు అని పిలవాలనిపిస్తోంది.'' అని అన్నారు.

తెలంగాణ ప్రస్తుత గవర్నర్, మాజీ బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ ఈ ప్రాజెక్టును 'మనిషి సృష్టించిన అద్భుతం'గా అభివర్ణించారు.

సెంట్రల్ వాటర్ కమిషన్ CWC ఈ ప్రాజెక్టును 'ఇంజనీరింగ్ అద్భుతం' అని పేర్కొంది

ఒక ఉన్నత స్థాయి CWC బృందం జనవరి 2018లో నిర్మాణ స్థలాన్ని సందర్శించింది. ఇందులో ప్రాజెక్ట్ అప్రైజల్ ఆర్గనైజేషన్ (PAO) చీఫ్ ఇంజనీర్ C.K.L. దాస్, PAO డైరెక్టర్ (సౌత్) ముఖర్జీ, CWC డైరెక్టర్ (హైడ్రాలజీ) నిత్యానంద్ రాయ్, డైరెక్టర్ (కాస్ట్ అప్రైజల్) రాజీవ్ కుమార్ లు ఉన్నారు.

ప్రాజెక్టు స‍ందర్శన తర్వాత, చీఫ్ ఇంజనీర్ C.K.L. దాస్ దీనిని "ఇంజనీరింగ్ అద్భుతమే కాదు అత్యంత‌ ప్రత్యేకమైనది కూడా" అనిఅభివర్ణించారు.

"మేము దేశంలో కానీ విదేశాల్లో కానీ ఇలాంటి ప్రాజెక్ట్‌ను ఎప్పుడూ చూడలేదు… ఇది తెలంగాణలోని ఇతర ప్రాజెక్టులకు ప్రయోజనం చేకూర్చే సమగ్ర ప్రాజెక్ట్. ప్రాజెక్ట్‌కి చాలా ప్లస్‌లు ఉన్నాయి, "అన్నారాయన.

ఊరికే ప్రాజెక్టును పొగడటమే కాదు ఈ ప్రాజెక్టుకు అవసరమైన తొమ్మిది అనుమతులను CWC ఇచ్చింది. దీన్ని బట్టే CWC కి ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి అవగాహన ఉందని స్పష్టంగా తెలుస్తుంది.

ఇక ఏ ప్రాజెక్టులకైనా ఆర్థిక సహాయం చేసే, అప్పులు ఇచ్చే ఆర్థిక సంస్థలు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుంటాయి. ఆ ప్రాజెక్టు వల్ల కలిగే లాభ నష్టాలను పూర్తిగా అంచనా వేస్తాయి. ఆ తర్వాతే డబ్బులు రిలీజ్ చేస్తాయి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఆర్థిక సంస్థల స్పందన పూర్తిగా పాజిటీవ్ గా ఉంది. కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలో నడిచే నాబార్డ్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టును అభినందించింది.

''ఈ ప్రాజెక్టు గ్రామీణ ఉపాది అవకాశాలను పెంపొందించే విధంగా ఉంది. రైతు సోదరులకు ప్రయోజనం చేకూర్చే అద్భుతమైన ప్రాజెక్టును చేపట్టినందుకు సీఎం కేసీఆర్‌ను అభినందనలు తెలియజేస్తున్నాను'' అని నాబార్డ్ చీఫ్ జి.ఆర్.చింతా అన్నారు.

'KLIP తెలంగాణను కోనసీమగా మార్చింది' అనే శీర్షికతో ఒక కథనాన్ని కూడా నాబార్డ్ వెబ్ సైట్ లో పోస్ట్ చేశారు. ఇప్పటికీ ఆ ఆర్టికల్ వెబ్ సైట్ లో ఉన్నది.

కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకులైన పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంకు కూడా ఈ ప్రాజెక్టుకు భారీగా రుణాలు మంజూరు చేశాయి.

ఈ మొత్తం వ్యవహారం చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ముందుగానే అన్ని విషయాలు కేంద్ర ప్రభుత్వానికి తెలుసునని, ఆ ప్రాజెక్టును పొగిడిన వారిలో బీజేపీ నాయకులు కూడా ఉన్నారని అర్దమవుతుంది.

నాలుగు ముఖ్యమైన అంశాల గురించి కేంద్ర ఆర్థిక, జలశక్తి మంత్రులు తెలుసుకోవడం ముఖ్యం.

ఎ) వారి సంబంధిత మంత్రిత్వ శాఖలు,వాటి సంబంధిత విభాగాలకు KLIP, దాని సాంకేతిక, ఆర్థిక వివరాల గురించి పూర్తిగా తెలుసు.

బి) CWC బృందం సందర్శించి ప్రాజెక్ట్‌కు అవసరమైన అనుమతులను అందించింది. CWC క్లియరెన్స్ లేకుండా KLIP నిర్మించబడదు.

సి) ప్రభుత్వ రంగ బ్యాంకులు, నాబార్డ్ వంటి ఆర్థిక సంస్థలకు కూడా ప్రాజెక్ట్ గురించి, రుణాల గురించి పూర్తిగా తెలుసు.

డి) తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రహస్యంగా, లేదా సంబంధిత కేంద్ర అధికారులకు తెలియకుండా నిర్మించలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రుణాలను భారత ప్రభుత్వ నిబంధనలను అనుసరించే, కేంద్ర ప్రభుత్వానికి తెలిసే తీసుకుంది.

కాబట్టి ఈ ప్రాజెక్ట్ పై కేంద్ర ప్రభుత్వానికి ముందునుండే పూర్తి అవగాహన ఉంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ వ్యతిరేక పోరాట నినాదం ఎత్తుకోనంత వరకు కేంద్రానికి గానీ, బీజేపీ నాయకులకు గానీ కాళేశ్వరం ప్రాజెక్టు తో ఎలాంటి ఇబ్బందీ రాలేదు. ఎప్పుడైతే కేసీఆర్ బీజేపీ ముక్త భారత్ అనే నినాదం అందుకున్నారో ఆ రోజు నుండే కేంద్రానికి కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలు కనపడటం ప్రారంభమైంది. దీన్ని బట్టి వాళ్ళు చెప్తున్న లోపాలు, తప్పుల్లో నిజమెంతో అర్దం చేసుకోవచ్చు.

First Published:  15 Sep 2022 8:20 AM GMT
Next Story