Telugu Global
Telangana

కాళేశ్వరం ప్యాకేజీ-9 ట్రయల్ రన్ సక్సెస్.. అభినందించిన మంత్రి కేటీఆర్

రూ.504 కోట్లతో ఈ ప్యాకేజీని చేపట్టగా.. పెండింగ్ పనులు కూడా పూర్తి చేసుకొని త్వరలోనే ప్రారంభానికి సిద్ధమవుతోంది.

కాళేశ్వరం ప్యాకేజీ-9 ట్రయల్ రన్ సక్సెస్.. అభినందించిన మంత్రి కేటీఆర్
X

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజీ-9 కింద నిర్మించిన మొదటి పంప్ ట్రయల్ రన్ విజయవంతం అయ్యింది. రాజన్న సిరిసిల్ల జిల్లా మల్కపేట వద్ద నిర్మించిన పంపుల ట్రయల్ రన్ సక్సెస్ కావడంపై మంత్రి కేటీఆర్.. ఇంజనీర్లు, నీటిపారుదల శాఖ అధికారులను అభినందించారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్.. సోమవారం రాత్రి కాళేశ్వరం ప్రాజెక్టు విజయగాథను వివరించారు. ఆ తర్వాతి రోజే మల్కపేట పంపుల ట్రయల్ రన్ విజయవంతం కావడం గమనార్హం. ఈ ట్రయల్ రన్ విజయం మంత్రి కేటీఆర్‌కు బహుమతి అని నీటిపారుదల శాఖ అధికారులు అంటున్నారు.

కోనారావుపేట మండలం మల్కపేట గ్రామంలో కాళేశ్వరం ప్యాకేజీ-9లో భాగంగా 3 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించారు. దీనికి సంబంధించిన పనులను త్వరగా పూర్తి చేయాలని, అలాగే ట్రయల్ రన్ నిర్వహించాలని గతంలోనే మంత్రి కేటీఆర్ ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో ట్రయల్ రన్ చేపట్టేందుకు 15 రోజులుగా ఇంజనీరింగ్ సిబ్బంది, అధికారులు రాత్రింబవళ్లు శ్రమించారు. మంగళవారం ఉదయం 7.00 గంటలకు ట్రయల్ రన్ నిర్వహించి గోదావరి జలాలను మల్కపేట రిజర్వాయర్‌లోనికి విజయవంతంగా ఎత్తిపోశారు.

అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ.. ట్రయల్ రన్ పనులను ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎన్. వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. అలాగే ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి, ఇతర ఏజెన్సీల ప్రతినిధులు పనులను దగ్గరుండి చూసుకున్నారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి కూడా ట్రయల్ రన్ పనులపై అధికారులను ఆరా తీస్తూ పనులు సజావుగా సాగేలా మార్గనిర్దేశం చేశారు.

మల్కపేట రిజర్వాయర్ నిర్మాణంతో కొత్తగా 60వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందనున్నది. దీంతో పాటు 26,150 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కానున్నది. మల్కపేట రిజర్వాయర్ నిర్మాణంతో వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లోని రైతాంగం ఎదుర్కుంటున్న సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనున్నది. బీడు భూములు కూడా పచ్చగా మారే అవకాశం ఏర్పడింది. రూ.504 కోట్లతో ఈ ప్యాకేజీని చేపట్టగా.. పెండింగ్ పనులు కూడా పూర్తి చేసుకొని త్వరలోనే ప్రారంభానికి సిద్ధమవుతోంది.

First Published:  23 May 2023 5:24 AM GMT
Next Story