Telugu Global
Telangana

ఆసియాలో అతిపెద్ద టెక్స్‌టైల్ పార్క్‌లో కైటెక్స్ యూనిట్లు.. రెండు నెలల్లో ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

కాకతీయ మెగా టైక్స్‌టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టడానికి అనేక సంస్థలు ముందుకు వచ్చాయి. అందులో కేరళకు చెందిన కైటెక్స్ ఒకటి.

ఆసియాలో అతిపెద్ద టెక్స్‌టైల్ పార్క్‌లో కైటెక్స్ యూనిట్లు.. రెండు నెలల్లో ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
X

ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే చేనేతకు ప్రసిద్ధి. వరంగల్‌లోని అజంజాహీ మిల్లు ఎంతో మందికి ఉపాధి కల్పించింది. కాటన్ పరిశ్రమకు ఇది ఆయువు పట్టులా ఉండేది. అయితే ఆ మిల్లు మూతపడటంతో పాటు చేనేతకు అప్పటి ప్రభుత్వాలు సరైన తోడ్పాటు అందించకపోవడంతో వేలాది మంది చేనేత కార్మికులు సూరత్, భీవండి, గాంధీనగర్, అహ్మదాబాద్, షోలాపూర్ వంటి ప్రాంతాలకు ఉపాధి వెతుక్కుంటూ వెళ్లిపోయారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వలస వెళ్లిన చేనేత కుటుంబాలను తిరిగి రాష్ట్రానికి రప్పించడానికి సీఎం కేసీఆర్ మెగా టైక్స్‌టైల్ పార్క్‌కు శ్రీకారం చుట్టారు.

ఎక్కడైతే అజంజాహీ మిల్లు మూతపడిందో.. అదే జిల్లాలో మెగా టైక్స్‌టైల్ పార్కు సిద్ధమయ్యింది. గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ పార్కులుగా విభజించిన ఈ మెగా టెక్స్‌టైల్ పార్క్.. ఆసియాలో అతిపెద్దిగా రికార్డు సృష్టించింది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట గ్రామంలో కాకతీయ మెగా టైక్స్‌టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టడానికి అనేక సంస్థలు ముందుకు వచ్చాయి. అందులో కేరళకు చెందిన కైటెక్స్ ఒకటి.

తెలంగాణలో కైటెక్స్ రూ.3 వేల కోట్ల పెట్టుబడి పెట్టడానికి నిర్ణయించింది. ఇందులో భాగంగా కాకతీయ మెగా టైక్స్‌టైల్ పార్కులో స్థలాన్ని కేటాయించారు. ఇప్పటికే కైటెక్స్ సంస్థ అక్కడ నిర్మాణాలు ప్రారంభించింది. ఫ్యాక్టరీ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. మరో రెండు నెలల్లో ఈ భారీ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'వరంగల్‌లో 1,350 ఎకరాల్లో విస్తరించిన కాకతీయ మెగా టైక్స్‌టైల్ పార్కులో కైటెక్స్ యూనిట్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. మరో రెండు నెలల్లో సీఎం కేసీఆర్ దీన్ని ప్రారంభిస్తారు' అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

కైటెక్స్ యూనిట్లు కేఎంటీపీలోనే కాకుండా హైదరాబాద్ శివారులో కూడా ప్రారంభిస్తున్నారు. ఈ యూనిట్లన్నీ కార్యకలాపాలు మొదలు పెడితే దాదాపు 28 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కైటెక్స్ గ్రూప్ తమ సంస్థల్లో 80 శాతం మహిళలకే అవకాశాలు కల్పిస్తున్నది. వరంగల్ జిల్లా వాసులకే కాకుండా.. తెలంగాణలోని చేనేత కుటుంబాలు ఇది చక్కని అవకాశం. ఇక్కడి యూనిట్లతో తయారయ్యే చిన్న పిల్లల వస్త్రాలను అమెరికాకు ఎగుమతి చేయనున్నారు. అంటే వరంగల్‌లో అంతర్జాతీయ స్థాయి నాణ్యత ఉన్న ఉత్పత్తుల తయారు చేయబోతున్నారు.


First Published:  27 Jun 2023 5:12 AM GMT
Next Story