Telugu Global
Telangana

మునుగోడులో కేఏ పాల్ సర్వే.. ఆసక్తికరంగా ఫలితాలు

ఇప్పటికే చాలామంది తనకు ఫోన్లు చేసి విజయంపై అభినందిస్తున్నారని అన్నారు. అభినందనలు తట్టుకోలేకపోతున్నానని, ఆ స్థాయిలో ఫోన్ కాల్స్ వస్తున్నాయని కూడా కామెడీ చేశారు పాల్.

మునుగోడులో కేఏ పాల్ సర్వే.. ఆసక్తికరంగా ఫలితాలు
X

ప్రచారం నుంచి పోలింగ్ వరకు మునుగోడులో సరదాగా తిరుగుతూ అందరికీ నవ్వులు పంచిన కేఏ పాల్.. పోలింగ్ తర్వాతి రోజు కూడా తనదైన శైలిలో హాస్యాన్ని పండించారు. 50వే ఓట్ల మెజార్టీతో తాను గెలవబోతున్నట్టు ప్రకటించారు. పాల్ సర్వేలో మునుగోడులో ఆయనకు 50వేల ఓట్ల మెజార్టీ వస్తుందని తేలిందట. మునుగోడులో లక్షా 5వేలమంది యువత తనకు ఓటు వేశారన చెప్పుకొచ్చారు పాల్.

పోలింగ్ శాతం నా వల్లే పెరిగింది..

మునుగోడులో 2018 ఎన్నికల్లో 91.3శాతం పోలింగ్ జరిగింది. మునుగోడు చరిత్రలో ఇదే అత్యథికం. ఈసారి ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం 93.13కి పెరిగింది. ఈ పెరుగుదలకు కారణం తానేనంటున్నారు కేఏ పాల్. తాను బరిలో దిగడం వల్లే యువత పోలింగ్ స్టేషన్లకు బారులు తీరారని చెప్పారు. టీఆర్ఎస్, బీజేపీ పోటా పోటీగా డబ్బులు పంచినా ప్రజలు తనకు ఓట్లు వేశారని అన్నారు. ఇప్పటికే చాలామంది తనకు ఫోన్లు చేసి విజయంపై అభినందిస్తున్నారని అన్నారు. అభినందనలు తట్టుకోలేకపోతున్నానని, ఆ స్థాయిలో ఫోన్ కాల్స్ వస్తున్నాయని కూడా కామెడీ చేశారు పాల్.

ఈవీఎంలు జాగ్రత్త..

ప్రజలంతా ఈవీఎంలు భద్రంగా చూసుకోవాలని, అందులోనే తన మెజార్టీ ఉందని చెప్పారు కేఏ పాల్. ఈవీఎంలను తరలించే స్ట్రాంగ్ రూమ్ ప్రాంతానికి రెండు రోజులు కాపలా ఉండాలని, అలా ఉండగలిగితే ఈవీఎంలో ఉన్న సమాచారాన్ని ఎవరూ మార్చకుండా చూడగలిగితే, ఫలితాల రోజు కేఏ పాల్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు. ఈవీఎంల సమాచారం తారుమారైతే మాత్రం ఫలితాలు తారుమారవుతాయని అన్నారు. మొత్తమ్మీద సీరియస్ గా జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో స్థానికులకు కాస్త ఊరటనిచ్చింది పాల్ ఎపిసోడ్ మాత్రమే. రకరకాల వేషాల్లో ఆయన ప్రచారం, పోలింగ్ రోజు హడావిడి, పోలింగ్ తర్వాత 50వేల మెజార్టీ ఖాయమంటూ విడుదల చేసిన వీడియో.. ఇలా అన్నీ ఆకట్టుకుంటున్నాయి. రేపు ఫలితాల తర్వాత కూడా ఆయన తనదైన శైలిలో వాటిని విశ్లేషించడం ఖాయం. అప్పుడు ఓటమికి ఎలాంటి కారణాలు వెదికి పెట్టుకుంటారో వేచి చూడాలి.

First Published:  4 Nov 2022 7:29 AM GMT
Next Story