Telugu Global
Telangana

తెలంగాణకు 28 దేశాల ప్రధానులు.. పాల్ కామెడీయా..? సీరియస్సా..?

అక్టోబర్ 2న హైదరాబాద్ జింఖానా గ్రౌండ్ లో ప్రపంచ శాంతి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు కేఏ పాల్. ఆ సమావేశాలకు 28 దేశాల ప్రధానులు వస్తున్నారని చెప్పారు. వారందరికీ ఆల్రడీ ఆహ్వానాలు పంపానని, వారు రావడానికి అంగీకరించారని స్పష్టం చేశారు.

తెలంగాణకు 28 దేశాల ప్రధానులు.. పాల్ కామెడీయా..? సీరియస్సా..?
X

ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ ఎప్పుడు ఏం మాట్లాడతారో, ఎవరిని పొగుడుతారో, ఎవరిని తిడతారో ఆయనకే తెలియదు. పాల్ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ ఫన్ మెటీరియల్ గా చూస్తున్నారే కానీ, ఆయన్ని ఓ సీరియస్ పొలిటీషియన్ గా ఎవరూ గుర్తించడంలేదు. తాజాగా మరోసారి సీరియస్ కామెడీ చేసి వార్తల్లోకెక్కారు కేఏ పాల్.

అక్టోబర్ 2న హైదరాబాద్ జింఖానా గ్రౌండ్ లో ప్రపంచ శాంతి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు కేఏ పాల్. ఆ సమావేశాలకు 28 దేశాల ప్రధానులు వస్తున్నారని చెప్పారు. వారందరికీ ఆల్రడీ ఆహ్వానాలు పంపానని, వారు రావడానికి అంగీకరించారని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల తరఫున కూడా ఆయా దేశాల ప్రధానులకు ఆహ్వానాలు వెళ్లాయన్నారు. వరణ్ గాంధీని కూడా తాను ఈ సమావేశానికి ఆహ్వానించానని, కానీ, టీఆర్ఎస్ నాయకులు అడ్డుపడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

శాపగ్రస్తులవుతారు జాగ్రత్త..

ప్రపంచ శాంతి సమావేశాలను అడ్డుకునేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు కేఏ పాల్. శాంతిసభను అడ్డుకునే వారు దేవుడి శాపానికి గురవుతారని అన్నారు. శాంతి సభలు జరిగితే తన సత్తా ఏంటో అందరికీ తెలుస్తుందని, అందుకే కొందరు ఈ సభలను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.

బాబ్బాబు ఓటర్ కార్డ్ ప్లీజ్..

రెండు తెలుగు రాష్ట్రాల్లో తనకు తిరుగులేదు అని చెప్పుకుంటున్న కేఏ పాల్ కి ఇప్పటి వరకూ ఓటర్ కార్డ్ లేదట. ఇటీవలే ఆయన కేంద్ర ఎన్నికల కమిషన్ కి లేఖ రాశారట. తనకు హైదరాబాద్ లో ఓటర్ కార్డ్ ఇప్పించాలని కోరారట. పనిలో పనిగా మునుగోడు ఉప ఎన్నికను బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించాలని కూడా కోరానని చెబుతున్నారు పాల్.

చివరకు ఏమవుతుందో..?

కేఏ పాల్ గతం ఘనంగానే ఉన్నా.. ప్రస్తుతం ఆయన మాటలకు, చేతలకు ఏమాత్రం పొంతన ఉండటంలేదు. సరిగ్గా ఎన్నికల సమయంలో హడావిడి చేసి వెళ్లిపోవడం ఆయనకు అలవాటే. ఈసారి కూడా తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడటంతో పాల్ రంగప్రవేశం చేశారు. పనిలో పనిగా ఏపీలోనూ పర్యటనలు చేసి వచ్చారు. ఇప్పుడు తెలంగాణలో ప్రపంచ శాంతి సభలు పెడుతున్నానని, 28 దేశాల ప్రధానులు వస్తారని చెబుతున్నారు. మరి ఈ మాటల్లో నిజమెంత..? అసలు వారికి ఆహ్వానాలు వెళ్లాయా..? వారు వస్తారా..? పాల్ పరువు నిలబెడతారా..? వేచి చూడాలి.

First Published:  2 Sep 2022 4:02 PM GMT
Next Story