Telugu Global
Telangana

ఇదేం విచిత్రం.. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి మద్దతు కోరిన కేఏ పాల్

కేఏపాల్ మాత్రం రాజగోపాల్ చేయి పట్టుకొని గుంజి.. కాసేపు గుసగుసలాడారు. అక్కడ ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. రాజగోపాల్ మాత్రం నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఇదేం విచిత్రం.. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి మద్దతు కోరిన కేఏ పాల్
X

రాజకీయాల్లో కేఏ పాల్‌ది ఓ విచిత్రమైన శైలి. ఆయన చెప్పే మాటలు, చేసే పనులు సీరియస్‌గా చేస్తున్నారో? లేదా కామెడీ చేస్తున్నారో? అర్థం కావు. మునుగోడు ఉపఎన్నిక బరిలో ప్రజాశాంతి పార్టీ తరపున గద్దర్‌ను బరిలో నిలిపారు. అయితే, ఆయన నామినేషన్ వేయడానికి అడ్డంకులు ఏర్పడటంతో స్వయంగా కేఏ పాల్ రంగంలోకి దిగారు. పార్టీ తరపున వేసిన ఒక సెట్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో రెండు సెట్‌‌ను అధికారులు ఆమోదించడంతో ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ క్రమంలో కేఏ పాల్ మునుగోడు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆదివారం చండూరు మండలంలో తన ప్రచారాన్ని కొనసాగించారు.

చండూరులో ప్రచారంలో ఉండగా బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన అనుచరులు, కార్యకర్తలతో తారసపడ్డారు. రాజగోపాల్‌ను చూసిన వెంటనే ఆలింగనం చేసుకున్న కేఏ పాల్ ఆయనతో మాట్లాడటానికి ప్రయత్నించారు. రాజగోపాల్ మాత్రం తల బాదుకుంటూ అక్కడి నుంచి వెళ్లడానికి ప్రయత్నించారు. కానీ కేఏపాల్ మాత్రం రాజగోపాల్ చేయి పట్టుకొని గుంజి.. కాసేపు గుసగుసలాడారు. అక్కడ ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. రాజగోపాల్ మాత్రం నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కేఏ పాల్‌ను చూసి బీజేపీ కార్యకర్తలు హోరుగా నినాదాలు చేశారు. జై బీజేపీ అనుకుంటూ ముందుకు సాగారు. అక్కడ ఏం జరిగిందో కేఏ పాల్ ఆ తర్వాత మీడియాకు చెప్పారు.

తాను తమ్ముడు రాజగోపాల్‌తో మాట్లాడాను. మునుగోడులో తనకు మద్దతు ఇవ్వమని కోరాను. తనను గెలిపిస్తే మునుగోడును 60 నెలల్లో అమెరికాలాగ మార్చేస్తానని అన్నాను. ఆయన ఏమీ స్పందించలేదని కేఏ పాల్ చెప్పారు. ఇప్పటి వరకు ఎవరూ చేయనంత అభివృద్ధి తాను చేస్తానని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఓట్లను కొనుక్కుంటున్నాయని ఆరోపించారు. ఒకప్పుడు అడవిలా ఉన్న హైదరాబాద్‌ను అభివద్ధి చేసింది తానేనని అన్నారు. ఆరు నెలల్లో 7 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. కేఏ పాల్ మాటలు విన్న వారంతా నవ్వుకున్నారు. హైదరాబాద్ అభివృద్ధి, మునుగోడును అమెరికా చేస్తాననడం, బీజేపీ అభ్యర్థి మద్దతు కోరడం చూసి.. ఇదేం విచత్రం అంటూ గుసగుసలాడుకుంటున్నారు.

First Published:  17 Oct 2022 4:58 AM GMT
Next Story