Telugu Global
Telangana

రెడ్డి బంధు, వెలమ బంధు, కమ్మ బంధు..

పోలింగ్ రోజు అడిగినవారందరికీ ఉంగరాలు ఇచ్చుకుంటూ పోయానని, అందుకే ఇప్పుడు తన చేతికి తక్కువ ఉంగరాలున్నాయని అన్నారు. నడుస్తూ వెళ్తే అన్ని పోలింగ్ బూత్‌లకు వెళ్లేందుకు టైమ్ సరిపోదని, పోలింగ్ రోజు తాను రన్నింగ్ చేయడానికి కారణం అదేనన్నారు పాల్.

రెడ్డి బంధు, వెలమ బంధు, కమ్మ బంధు..
X

అప్పట్లో తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డికి రెడ్డి బంధు ఇచ్చానని, కేసీఆర్‌కి వెలమ బంధు ఇచ్చానని, చంద్రబాబుకి కమ్మబంధు కూడా ఇచ్చానని చెప్పారు మునుగోడు ఉప ఎన్నికల స్వతంత్ర అభ్యర్థి కేఏ పాల్. మరో అడుగు వెనక్కి వేసి పీవీ నరసింహారావుకి బ్రాహ్మణ బంధు కూడా ఇచ్చానన్నారు. ఈవీఎంలను చూసేందుకు వచ్చిన ఆయన, తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ఈవీఎంలకు తాను కాపలా ఉంటానంటే అధికారులు వెళ్లిపొమ్మంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆద్యంతం ప్రెస్ మీట్‌లో నవ్వులు పూయించారు పాల్. అదే సమయంలో పాల్‌ని సీరియస్‌గా పలు ప్రశ్నలు అడిగి విలేకరులు కూడా హాస్యచతురత ప్రదర్శించారు.

కేసీఆర్ ప్రెస్‌మీట్‌ తర్వాత బీజేపీ ఎలాగూ భుజాలు తడుముకుంటోంది. తాను రియాక్ట్ కాకపోతే బాగోదని అనుకున్నాడేమో.. కేఏపాల్ కూడా కేసీఆర్‌పై విమర్శలు మొదలుపెట్టారు. అయితే ఆయన అన్ని పార్టీలను అలాగే విమర్శిస్తూ, తనదైన శైలిలో అందరిపై చెణుకులు విసిరారు. ఈ దఫా మీడియా తనను బాగా పట్టించుకుందని, మద్దతిచ్చిందని, మీడియాకు వందనాలు అని చెప్పారు. ఇదే ప్రోత్సాహం 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వరకు ఇవ్వాలన్నారు.

ఈసీ నిర్ణయాన్ని ప్రశ్నించిన పాల్..

3వ తేదీ ఎన్నికలు పెట్టి 6వ తేదీ కౌంటింగ్ ఏంటని ప్రశ్నించారు కేఏపాల్. అన్ని రోజులు ఈవీఎంలను ఎందుకు భద్రపరచాలని చెప్పారు. నిన్న ఎన్నిక పెట్టి ఈ రోజు కౌంటింగ్ పెడితే సరిపోతుంది కదా అన్నారు. తనకు 50 వేల మెజార్టీ ఖాయమని, సెకండ్ ప్లేస్‌లో టీఆర్ఎస్, మూడో స్థానంలో బీజేపీ, నాలుగో స్థానంలో కాంగ్రెస్ ఉంటాయన్నారు. ప్రధాన పార్టీ మీటింగ్‌లకు వెళ్లకుండా యువత తనతోపాటే ఉన్నారని చెప్పుకొచ్చారు. గతంలోనే తనకు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉండేదని, అలాంటిది ఇప్పుడు కనీసం ఒక్క కానిస్టేబుల్‌ని కూడా సెక్యూరిటీగా ఇవ్వకపోవడం దారుణం అని అన్నారు పాల్.

వారసత్వ రాజకీయాలు వదిలేయాలని, ప్రజలందరికీ ఎమ్మెల్యేలు కావాలని ఉండదా అన ప్రశ్నించారు కేఏపాల్. మునుగోడు నుంచే తాను 2023 ఎన్నికల శంఖారావం మోగించానని, 119 నియోజకవర్గాలో అభ్యర్థులను నిలబెడతానన్నారు. తనకు మునుగోడులో హోటల్ రూమ్ దొరక్కుండా చేశారని, కానీ ఓ అభిమాని హోటల్‌లో రూమ్ ఖాళీ చేయించి తనకు ఇచ్చారన్నారు. తన హెలికాప్టర్ గుర్తు తీసేస్తే, చివరకు ఇలా ఉంగరం గుర్తుతో అడ్జస్ట్ అయిపోయానని చెప్పారు. పోలింగ్ రోజు అడిగినవారందరికీ ఉంగరాలు ఇచ్చుకుంటూ పోయానని, అందుకే ఇప్పుడు తన చేతికి తక్కువ ఉంగరాలున్నాయని అన్నారు. నడుస్తూ వెళ్తే అన్ని పోలింగ్ బూత్‌లకు వెళ్లేందుకు టైమ్ సరిపోదని, తాను ఆ రోజు రన్నింగ్ చేయడానికి కారణం అదేనన్నారు పాల్. తన పోలింగ్ ఏజెంట్ కూడా టీఆర్ఎస్‌కి అమ్ముడుపోయారంటూ ఆరోపించారు. 2023లో తాను తెలంగాణ సీఎం అయ్యాక, నాలుగేళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని చెప్పారు.

First Published:  4 Nov 2022 10:27 AM GMT
Next Story