Telugu Global
Telangana

పాల్ పార్టీలోకి వలసల వెల్లువ..! ఎప్పుడు..? ఎలా..?

తన పార్టీలో చేరేందుకు ఎవరైనా ఏప్రిల్-30వరకు ఆగాల్సిందేనని చెప్పారు. ఆ తర్వాతే తాను చేరికల విషయంలో నిర్ణయం తీసుకుంటానని, అప్పటి వరకు ఎవరూ ఇబ్బంది పెట్టొద్దని కోరారు కేఏ పాల్.

పాల్ పార్టీలోకి వలసల వెల్లువ..! ఎప్పుడు..? ఎలా..?
X

ఆమధ్య మునుగోడు ఉప ఎన్నికల సమయంలో హడావిడి చేసి, కామెడీ చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, మళ్లీ తెరపైకి వచ్చారు. మరోసారి ఆయన కామెడీ చేశారు. తన పార్టీలోకి వలసలు వెల్లువెత్తుతాయని చెప్పారు. ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని అన్నారు పాల్. అంతే కాదు.. తన పార్టీలో చేరేందుకు ఎవరైనా ఏప్రిల్-30వరకు ఆగాల్సిందేనని చెప్పారు. ఆ తర్వాతే తాను చేరికల విషయంలో నిర్ణయం తీసుకుంటానని, అప్పటి వరకు ఎవరూ ఇబ్బంది పెట్టొద్దని కోరారు.

తన పార్టీలో ఇప్పటికే చాలామంది రిటైర్డ్ ఉన్నతాధికారులు చేరారని, మరికొంతమంది వైద్యులు, ప్రొఫెసర్లు, లాయర్లు కూడా పార్టీలో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నారని అన్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలలో 15 శాతం మంది నిజాయితీ పరులున్నారని, వారంతా తనపార్టీవైపే చూస్తున్నారని చెప్పారు.

అదీ నా పవర్..

తెలంగాణ సచివాలయ ప్రారంభం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఆలస్యం అయింది. అయితే దాన్ని తన ఘనతగా చెప్పుకుంటున్నారు పాల్. తన వల్లే సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా పడిందని, తాను కోర్టులో కేసు వేయడం వల్లే ప్రభుత్వం వెనక్కి తగ్గిందని అన్నారు. అంబేద్కర్ జయంతి రోజునే సచివాలయం ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు.

గుర్తు సంగతేంటి..?

ప్రజాశాంతి పార్టీ అంటున్నారు కానీ, ఆ పార్టీకి ప్రస్తుతం ఎన్నికల సంఘం గుర్తింపు రద్దు చేసింది, గుర్తు కూడా తీసేసింది. అందుకే ఆమధ్య మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా పాల్ ఉంగరం గుర్తుపై పోటీ చేశారు, పది వేళ్లకు పది ఉంగరాలు ధరించి ఎలక్షన్ రోజు హడావిడి చేశారు. పార్టీ గుర్తుకోసం ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై కేసు నడుస్తోందని, తన గుర్తు తనకు తిరిగి వస్తుందని అన్నారు. గుర్తు విషయంలో కచ్చితంగా తనకు అనుకూలంగా తీర్పు వస్తుందన్నారు పాల్.

First Published:  13 Feb 2023 5:32 AM GMT
Next Story