Telugu Global
Telangana

డాక్టర్ ప్రీతి చెల్లికి ఉద్యోగం.. ఉత్తర్వులు జారీ చేసిన హెచ్ఎండీఏ

ప్రభుత్వానికి, ప్రీతి కుటుంబానికి మధ్య మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారధిగా ఉండి అన్ని విషయాలు చూసుకున్నారు.

డాక్టర్ ప్రీతి చెల్లికి ఉద్యోగం.. ఉత్తర్వులు జారీ చేసిన హెచ్ఎండీఏ
X

కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతానికి బలైపోయిన పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది. ప్రీతి మరణించిన తర్వాత ఆమె కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించడంతో పాటు.. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రభుత్వం తరపున మొదట ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. ఆ తర్వాత ప్రభుత్వానికి, ప్రీతి కుటుంబానికి మధ్య మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారధిగా ఉండి అన్ని విషయాలు చూసుకున్నారు.

మంత్రి కేటీఆర్ తన శాఖ పరిధిలోని హెచ్ఎండీఏలో ప్రీతి చెల్లి పూజకు ఉద్యోగం ఇస్తానని చెప్పారు. ఈ మేరకు శనివారం పూజను హెచ్ఎండీఏ ఐటీ సెల్‌లో కాంట్రాక్ట్ పద్దతిలో సపోర్ట్ అసోసియేట్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు గాను ప్రీతి కుటుంబ సభ్యులు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, దయాకర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ..

ప్రతీ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తరపున తన నియోజకవర్గంలో విరాళాలను సేకరించి రూ.20 లక్షలు వారికి అందించానని చెప్పారు. ప్రతీ కుటుంబానికి సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని.. అందుకు మంత్రి కేటీఆర్ సహకరించారని చెప్పారు. ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను నిలబెట్టుకున్నామన్నారు. ఆ కుటుంబానికి పూర్తి అండగా ఉన్నామని చెప్పారు. ఆ రోజు ప్రీతి కుటుంబం దగ్గరకు వచ్చి రాజకీయాలు చేసిన ఏ ఒక్కరు కూడా మళ్లీ కనిపించలేదని విమర్శించారు. ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన జరగడం బాధకరమని.. ప్రతీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు మంత్రి దయాకర్ రావు అన్నారు.

First Published:  20 May 2023 1:54 PM GMT
Next Story