Telugu Global
Telangana

బీఆర్ఎస్‌లో చేరిన జిట్టా.. ఆ హామీతోనేనా..?

తెలంగాణ ఉద్యమకారుడిగా జిట్టా బాలకృష్ణారెడ్డికి మంచి పేరు ఉంది. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత జిట్టా ఆ పార్టీ యువజన విభాగానికి అధ్యక్షుడిగా పనిచేశారు.

బీఆర్ఎస్‌లో చేరిన జిట్టా.. ఆ హామీతోనేనా..?
X

తెలంగాణ ఉద్యమకారుడు, భువనగిరి నియోజకవర్గానికి చెందిన కీలక నేత జిట్టా బాలకృష్ణారెడ్డి సొంతగూటికి చేరారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత మళ్లీ తెలంగాణ భవన్‌కు వచ్చారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జిట్టా పోటీ చేయడం దాదాపు లేనట్టే. దీంతో ఆయనకు బీఆర్ఎస్‌ ఎలాంటి హామీ ఇచ్చిందనే దానిపై ఆసక్తికరంగా మారింది. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ బీజేపీలో చేరడంతో.. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి స్థానం నుంచి జిట్టాకు అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. ఇక ఉద్యోగ సంఘాల నేత మామిళ్ల రాజేందర్‌ కూడా గులాబీ కండువా కప్పుకున్నారు.




తెలంగాణ ఉద్యమకారుడిగా జిట్టా బాలకృష్ణారెడ్డికి మంచి పేరు ఉంది. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత జిట్టా ఆ పార్టీ యువజన విభాగానికి అధ్యక్షుడిగా పనిచేశారు. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండి ఉద్యమంలో కీలకంగా పని చేశారు. అయితే 2009లో పొత్తులో భాగంగా భువనగిరి టికెట్ టీడీపీ నేత ఎలిమినేటి ఉమామాధవ రెడ్డికి దక్కింది. దీంతో ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన జిట్టా రెండోస్థానంలో నిలిచారు. తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వైఎస్సార్ మరణంతో ఆ పార్టీకి సైతం రాజీనామా చేశారు. 2014లోనూ భువనగిరి అసెంబ్లీకి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. YSRCPలోనూ కొంతకాలం పని చేసిన జిట్టా.. తర్వాత యువ తెలంగాణ పార్టీ స్థాపించారు. 2018లో బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా భువనగిరి నుంచి పోటీ చేసినప్పటికీ గెలుపు అందుకోలేకపోయారు.




2022లో యువ తెలంగాణ పార్టీని బీజేపీలో విలీనం చేసిన జిట్టా బాలకృష్ణా రెడ్డి.. బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్‌ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనను బీజేపీ నుంచి సస్పెండ్ చేశారు. తర్వాత కోమటిరెడ్డి సమక్షంలో సెప్టెంబర్‌ 16న కాంగ్రెస్‌లో చేరారు. భువనగిరి కాంగ్రెస్‌ టికెట్ కోసం ప్రయత్నించారు. కాగా, బీఆర్ఎస్‌లో చేరి తిరిగి కాంగ్రెస్‌కు వచ్చిన కుంభం అనిల్ కుమార్‌ రెడ్డికే టికెట్ ఇచ్చేందుకు పార్టీ మొగ్గు చూపడంతో.. హస్తం పార్టీకి గుడ్‌ బై చెప్పిన జిట్టా బీఆర్ఎస్‌లో చేరిపోయారు.

First Published:  20 Oct 2023 9:32 AM GMT
Next Story