Telugu Global
Telangana

టెన్త్, ఇంటర్లో టాపర్.. అయినా బుద్ధి గడ్డి తిన్నది

ప్రధాన నిందితుడు చైతన్య కృష్ణతోపాటు ఆ నలుగురు హైటెక్ సిటీ ప్రాంతంలోని ఓ కాలేజీలో కలసి చదువుకున్నారు. అందరికీ మంచి మార్కులు రావాలనే ఉద్దేశంతో టాపర్ గా ఉన్న చైతన్య కృష్ణ తన సమాధానాలను వారికి కూడా చేరవేయాలనుకున్నాడు.

టెన్త్, ఇంటర్లో టాపర్.. అయినా బుద్ధి గడ్డి తిన్నది
X

జేఈఈ పరీక్షలు రాసే విద్యార్థులను సిబ్బంది ఎంత క్షుణ్ణంగా తనిఖీ చేస్తారో అందరికీ తెలుసు. అమ్మాయిల లోదుస్తులు, చెవి దుద్దులు.. తీసివేయించి పరీక్ష హాల్ లోకి పంపించిన ఘటనలు చాలా చోట్ల జరిగాయి, వివాదాలకు కారణమయ్యాయి. కానీ ఇక్కడ ఓ విద్యార్థి ఏకంగా సెల్ ఫోన్ తో లోపలికి వెళ్లినా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు ఎగ్జామినర్ కి అనుమానం రావడంతో వ్యవహారం బట్టబయలైంది. పోలీసులు ఆ కేటుగాడిని అరెస్ట్ చేశారు. అయితే సెల్ ఫోన్ తీసుకెళ్లింది అతడి కోసం కాదని, స్నేహితులకోసమని తెలియడంతో పోలీసులే షాకయ్యారు.

పరీక్ష హాల్ లోకి సెల్ ఫోన్ తీసుకెళ్లిన విద్యార్థి పేరు చింతపల్లి చైతన్య కృష్ణ. ఊరు కడప. పరీక్ష రాసింది సికింద్రాబాద్ లోని ఎస్వీఐటీ సెంటర్ లో. టెన్త్, ఇంటర్లో టాపర్ గా ఉన్న చైతన్య కృష్ణ.. జేఈఈని ఈజీగా పాసయ్యేవాడు. కానీ తనతోపాటు తన స్నేహితులకు కూడా ఈ పరీక్షలో మంచి మార్కులు రావాలనే ఉద్దేశంతో తన ఆన్సర్లను ఫొటోలు తీసి స్నేహితులకు వాట్సప్ చేశాడు. వారు కూడా వేర్వేరు కాలేజీల్లో పరీక్షలు రాసినట్టు తేలింది. దీనిపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.

ప్రధాన నిందితుడు చైతన్య కృష్ణతోపాటు ఆ నలుగురు హైటెక్ సిటీ ప్రాంతంలోని ఓ కాలేజీలో కలసి చదువుకున్నారు. అందరికీ మంచి మార్కులు రావాలనే ఉద్దేశంతో టాపర్ గా ఉన్న చైతన్య కృష్ణ తన సమాధానాలను వారికి కూడా చేరవేయాలనుకున్నాడు. అయితే అడ్డంగా బుక్కయ్యాడు. ఈ స్మార్ట్ కాపీయింగ్ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. చైతన్య కృష్ణను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా నలుగురి వ్యవహారంలో విచారణ జరుపుతున్నారు.

First Published:  6 Jun 2023 8:50 AM GMT
Next Story