Telugu Global
Telangana

డిపాజిట్లు కూడా దక్కని జనసేన

జనసేన అభ్యర్థుల తరపున వివిధ నియోజకవర్గాల్లో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్, కూకట్‌పల్లిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా ప్రచారం చేశారు. అయినా ఆ పార్టీ అభ్యర్థులు అన్ని స్థానాల్లోనూ డిపాజిట్‌ కూడా దక్కించుకోలేకపోయారు.

డిపాజిట్లు కూడా దక్కని జనసేన
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. బీజేపీతో పొత్తులో భాగంగా 8 సీట్లలో పోటీ చేసిన ఆ పార్టీ అభ్యర్థులు అన్నిచోట్లా ఓడిపోయారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ డిపాజిట్లు కోల్పోయారు. కూకట్‌పల్లిలో ప్రేమ్‌కుమార్‌కు మాత్రమే అత్యధికంగా 39,830 ఓట్లు వచ్చాయి. మిగిలినవారంతా అతి తక్కువ ఓట్లకే పరిమితమయ్యారు. ఇక జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్‌ తాండూరులో పోటీచేయగా ఆయనకు 4,087 ఓట్లు మాత్రమే రావడం గమనార్హం. అలాగే కోదాడలో 2,151 ఓట్లు, నాగర్‌ కర్నూల్‌లో 1,955, ఖమ్మంలో 3,053, కొత్తగూడెంలో 1,945, వైరాలో 2,712, అశ్వారావుపేటలో 2,281 ఓట్లు మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులకు వచ్చాయి. జనసేన అభ్యర్థుల తరపున వివిధ నియోజకవర్గాల్లో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్, కూకట్‌పల్లిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా ప్రచారం చేశారు. అయినా ఆ పార్టీ అభ్యర్థులు అన్ని స్థానాల్లోనూ డిపాజిట్‌ కూడా దక్కించుకోలేకపోయారు.

పోటీ చేసిన అభ్యర్థులు వీరే...

ఇక జనసేన తరఫున కూకట్‌పల్లిలో ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్, తాండూరులో నేమూరి శంకర్‌ గౌడ్, కోదాడలో మేకల సతీష్‌రెడ్డి, నాగర్‌ కర్నూల్‌లో లక్ష్మణ్‌ గౌడ్, ఖమ్మంలో మిర్యాల రామకృష్ణ, కొత్తగూడెంలో లక్కినేని సురేందర్‌రావు, వైరాలో డాక్టర్‌ తేజావత్‌ సంపత్‌ నాయక్, అశ్వారావుపేటలో ముయబోయిన ఉమాదేవి పోటీ చేశారు. జనసేన రాష్ట్రంలో రిజిస్టర్డ్‌ రాజకీయ పార్టీ కాకపోవడంతో ఎన్నికల్లో పోటీకి ’కామన్‌ సింబల్‌’ దక్కలేదు. ఆ పార్టీకి గతంలో కేటాయించిన గాజు గ్లాస్‌ గుర్తును కూడా ఈసీ కేటాయించకపోవడంతో, అభ్యర్థులంతా ఇండిపెండెంట్లుగానే బరిలో నిలిచారు.

పెదవి విరుస్తున్న బీజేపీ నేతలు...

తెలంగాణలో అంతగా పట్టు, గుర్తింపు లేని జనసేనకు 8 సీట్లు కేటాయించడం వల్ల తమకు రాజకీయంగా పెద్దగా ప్రయోజనం లేకుండాపోయిందని బీజేపీ నేతలు పెదవి విరుస్తున్నారు. తమ పార్టీకి పట్టు ఉండడంతో పాటు, గెలిచే అవకాశాలున్న స్థానాలను కూడా జనసేన డిమాండ్‌ చేసి తీసుకుందని సీట్ల సర్దుబాటు సమయంలోనే ఆయా స్థానాల్లోని బీజేపీ నాయకులు విమర్శించారు. జనసేనకు కేటాయించిన 8 సీట్లలో తమ పార్టీ నేతలు పోటీచేసి ఉంటే కనీసం రెండు, మూడు అయినా గెలిచే అవకాశాలుండేవని బీజేపీ నాయకులు వాపోతున్నారు. కూకట్‌ పల్లి, తాండూరు తదితర సీట్లు జనసేనకు కేటాయించడం పట్ల ఆయా చోట్ల బీజేపీ నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. ఇంత చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు.


First Published:  4 Dec 2023 5:56 AM GMT
Next Story