Telugu Global
Telangana

కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టిన పేపర్ యాడ్..!

వరుసగా జరుగుతున్న ఘటనలు ప్రభుత్వంలో భట్టికి నిజంగానే ప్రాధాన్యత తగ్గించే కుట్ర జరుగుతుందా అనే ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి.

కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టిన పేపర్ యాడ్..!
X

తుక్కుగూడలో నిర్వహించే కాంగ్రెస్‌ జన జాతర సభ కోసం వార్తాపత్రికలకు ఇచ్చిన ప్రకటన కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హోదాను ఉద్దేశపూర్వకంగా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హోదా పరంగా సీఎం తర్వాతి పదవిలో ఉన్న భట్టికి తగిన ప్రాధాన్యత కల్పించడం లేదని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జనజాతర సభ నేపథ్యంలో కాంగ్రెస్ ఇచ్చిన పత్రిక ప్రకటనలు వివాదాస్పదంగా మారాయి. ఈ ప్రకటనలో సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్‌, ప్రియాంక ఫొటోలను పెద్ద సైజులో వేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫొటో కంటే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫొటో పెద్దగా వేయడం, భట్టికి ప్రత్యేకత ఏమి లేదనట్టుగా ఆయన పక్కనే మరో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఫొటో వేయించడం చర్చకు దారి తీసింది.

వరుసగా జరుగుతున్న ఘటనలు ప్రభుత్వంలో భట్టికి నిజంగానే ప్రాధాన్యత తగ్గించే కుట్ర జరుగుతుందా అనే ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. యాదాద్రి ఆలయంలో భట్టిని తక్కువ ఎత్తులో కూర్చోబెట్టడం సహా హైదరాబాద్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులోనూ భట్టికి అవమానం జరిగిందని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.

First Published:  6 April 2024 11:14 AM GMT
Next Story