Telugu Global
Telangana

లంచం అడిగిన‌ అధికారికి నోట్ల దండతో సత్కారం.. వీడియో వైరల్

జగిత్యాల జిల్లాలో కల్వకోట, భీమారం, బొమ్మన, మంగేలా గ్రామాలకు నూతన మత్స్యకార సొసైటీలను ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

లంచం అడిగిన‌ అధికారికి నోట్ల దండతో సత్కారం.. వీడియో వైరల్
X

ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే కొందరు అధికారులు తమ చేతులు తడిపితేనే ఏ పనైనా చేసిపెట్టేది. వీళ్ళ ఆగడాలు భరించలేక కొందరు అడిగిన డబ్బిచ్చి పని పూర్తిచేసుకుంటుంటారు. మరికొందరు మాత్రం ఏసీబీకి పట్టిస్తుంటారు. అయితే తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో మాత్రం కొందరు మత్స్యకారులు లంచగొండి అధికారికి వారే తగిన బుద్ధి చెప్పారు. అవినీతి అధికారి మెడలో నోట్ల దండ వేసి అతడి బాగోతాన్ని బయటపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జగిత్యాల జిల్లాలో కల్వకోట, భీమారం, బొమ్మన, మంగేలా గ్రామాలకు నూతన మత్స్యకార సొసైటీలను ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మత్స్యకారులు సొసైటీల ఏర్పాటు కోసం కలెక్టరేట్ కు వెళ్లి మత్స్య శాఖకు చెందిన దామోదర్ అనే అధికారిని కలువగా.. తనకు లంచం ఇస్తేనే సొసైటీల ఫైల్ కదులుతుందని చెప్పాడు. సొసైటీల ఏర్పాటు కోసం ఆరు నెలలుగా మత్స్యకారులు ఆఫీసు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయినా ఆ అధికారి పట్టించుకోకపోవడంతో వారు విసిగిపోయారు. దీంతో సదరు అధికారికి బుద్ధి చెప్పాలని మత్స్యకారులు నిర్ణయించుకున్నారు.

దామోదర్ కు లంచంగా ఇవ్వాల్సిన డబ్బును ఒక దండగా గుచ్చారు. ముందుగా మత్స్యకారులు కలెక్టరేట్ కు వెళ్లి ప్రజావాణిలో కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మత్స్యకారులు దామోదర్ దగ్గరకు వెళ్లి కరెన్సీ నోట్ల దండను అతడి మెడలో వేశారు. లంచం కోసం తమను వేధిస్తున్నాడని అందరికీ తెలిసేలా దండ వేశారు. దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జరిగిన సంఘటనపై కలెక్టర్ స్పందించారు. దామోదర్ పై ఫిర్యాదు అందిందని, పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి అతడిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

First Published:  12 Dec 2023 7:37 AM GMT
Next Story