Telugu Global
Telangana

శ్రీరాముడు అల్లా మధ్య పంచాయితీ లేదు -జగ్గారెడ్డి

‘శ్రీరాముడు, అల్లా మధ్య ఏమైనా పంచాయితీ ఉందా..? ఎప్పుడైనా వారు కొట్టుకున్నారా.. మీరు చూశారా..?’ అని జగ్గారెడ్డి అంబేద్కర్ విగ్రహావిష్కరణకు వచ్చినవారిని ప్రశ్నించారు.

Jagga Reddy
X

ఎమ్మెల్యే జగ్గారెడ్డి

ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కులాలు, మతాల వారీగా జనాలను విభజిస్తున్నారని మండిపడ్డ ఆయన పురాణ పురుషులు, వారి కులాలు అంటూ సుదీర్ఘ ఉపన్యాసమిచ్చారు. సంగారెడ్డి జిల్లా సదాశివాపేట మండలం ఆత్మకూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన జగ్గారెడ్డి పురాణాల్లో కులాల ప్రస్తావన చేశారు. ఏ దేవుడు ఏ కులంలో పుట్టాడో వివరణ ఇచ్చారు.

అరుంధతి, జాంబవంతుడు ఎస్సీలే..

అరుంధతి ఎస్సీ సామాజికవర్గానికి చెందినవారని అన్నారు జగ్గారెడ్డి. రెడ్డి, బ్రాహ్మణుడు.. ఇలా ఏ కులంలో పెళ్లి జరిగినా చివరకు అరుంధతి నక్షత్రం చూడాల్సిందేనన్నారు జగ్గారెడ్డి. కులాల మధ్య, మతాల మధ్య పంచాయితీ కలియుగం వచ్చాకే మొదలైందని చెప్పారు. హనుమంతుడుకి ఉన్న బలం గురించి మొదటగా చెప్పింది జాంబవంతుడేనని.. ఆయన కూడా ఎస్సీ సామాజిక వర్గమేనని అన్నారు జగ్గారెడ్డి. ఎస్సీ అయిన జాంబవంతుని కూతురు శ్రీకృష్ణుడిని పెళ్లాడిందని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

రాముడు-అల్లా

‘శ్రీరాముడు, అల్లా మధ్య ఏమైనా పంచాయితీ ఉందా..? ఎప్పుడైనా వారు కొట్టుకున్నారా.. మీరు చూశారా..?’ అని జగ్గారెడ్డి అంబేద్కర్ విగ్రహావిష్కరణకు వచ్చినవారిని ప్రశ్నించారు. వారే కొట్టుకోలేదని, కానీ వారి పేరు చెప్పి ఇప్పుడు జనం కొట్టుకుంటున్నారని అన్నారు జగ్గారెడ్డి.

అంబేద్కర్ అన్ని ఊళ్లలో ఉండాలి..

మహానుభావుడు అంబేద్కర్ విగ్రహం ప్రతి గ్రామంలో ఉండాలన్నారు జగ్గారెడ్డి. అంబేద్కర్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. కష్టాలు, బాధలు, అవమానాలు చూసి అంబేద్కర్ చదువుకున్నారని, ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలని జగ్గారెడ్డి సూచించారు. అంటరానితనాన్ని నిర్ములించాలంటే విద్య ఒక్కటే మార్గమన్నారు. అయితే ఆయన అరుంధతి, జాంబవంతుడు అంటూ కులాలు ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

First Published:  24 Jan 2023 6:31 AM GMT
Next Story