Telugu Global
Telangana

జడ్చర్ల కాంగ్రెస్ లో చిచ్చు... అనిరుధ్ x ఎర్రశేఖర్

జడ్చర్ల కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు మొదలయ్యింది. ఎప్పటి నుంచో జడ్చర్ల లో పని చేస్తున్న తనను కాదని ఎర్రశేఖర్ ను పార్టీలో చేర్చుకోవడం పట్ల అనిరుధ్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. ఈ మేరకు ఆయన పార్టీ తెలంగాణ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ కు లేఖ రాశారు.

జడ్చర్ల కాంగ్రెస్ లో చిచ్చు... అనిరుధ్ x ఎర్రశేఖర్
X

కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు, గ్రూపు రాజకీయాలు కొత్త కాకపోయినా.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు వేడి పుట్టిస్తున్నాయి. రేవంత్ పీసీసీ అధ్యక్షుడయ్యాక.. తన వర్గీయులను పాత టీడీపీ నేతలను కాంగ్రెస్ లో చేర్చుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో అప్పటికే ఆయా నియోజకవర్గాల్లో పాతుకుపోయిన కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఎదురైంది. ఇక్కడ అనిరుధ్ రెడ్డి అనే నాయకుడు కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గ ఇంచార్జిగా కొనసాగుతున్నారు. ఇప్పటికే సేవా కార్యక్రమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అనిరుధ్ రెడ్డికి కోమటిరెడ్డి అనుచరుడిగా పేరుంది.

ఇదిలా ఉంటే మొదట టీడీపీలో ఉండి.. ఆ తర్వాత బీజేపీలో చేరిన ఎర్రశేఖర్ రేవంత్ ప్రోద్బలంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ అనుచరుడిని కాబట్టి తనకు టికెట్ కన్ ఫార్మ్ అని ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. ఏకపక్షంగా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. దీంతో అనిరుధ్ అనుచరులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.

తాను చాలా రోజులుగా సొంత ఖర్చుతో నియోజకవర్గంలో పార్టీని బాగుచేస్తే.. ఇప్పుడు తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన వాపోతున్నారు. ఇదిలా ఉంటే అనిరుధ్ రెడ్డి గురువారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ కు లేఖ రాశారు. ' నేను నియోజవర్గంలో ఎంతో కాలంగా పనిచేస్తున్నాను. కానీ నా ప్రమేయం లేకుండా నాకు మాట మాత్రమైనా చెప్పకుండా ఎర్రశేఖర్ ను పార్టీలోకి తీసుకొచ్చారు. అతడితో కలిసి నేను పనిచేయలేను' అంటూ ఠాగూర్ కు అనిరుధ్ లేఖ రాశారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

First Published:  18 Aug 2022 11:59 AM GMT
Next Story