Telugu Global
Telangana

కాంగ్రెస్ డీలా.. ఎందుకిలా

పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ మరింత బలహీనపడే ఛాన్స్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

కాంగ్రెస్ డీలా.. ఎందుకిలా
X

తెలంగాణ రాష్ట్రంలో సంస్థాగతంగా ఎంతో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం డీలా పడిపోయినట్టు కనిపిస్తోంది. రాష్ట్రంలో సరిగ్గా కార్యకర్తలు లేకపోయినా బీజేపీ మాత్రం దూకుడుగా వ్యవహరిస్తోంది. నిజానికి భారతీయ జనతా పార్టీకి ఇప్పటికీ చాలా జిల్లాల్లో కనీసం చెప్పుకోదగ్గ స్థాయిలో నేతలు కూడా లేరు. చాలా నియోజకవర్గాల్లో వారికి అభ్యర్థులు కూడా కరువే. అయినా కేంద్రంలో అధికారంలో ఉన్నామన్న ధీమాతో బీజేపీ దూసుకుపోతోంది. ఇతర పార్టీల నేతలను చేర్చుకొనేందుకు తహతహలాడుతోంది. కానీ రాష్ట్రంలో ఎంతో బలంగా ఉండి.. టీఆర్ఎస్ ను సైతం ఎదురించే సత్తా ఉన్న కాంగ్రెస్ మాత్రం డీలా పడినట్టు కనిపిస్తోంది.

ఆ పార్టీ అసలు ప్రతిపక్ష పాత్రనైనా సరిగ్గా పోషిస్తుందో.. లేదో.. అన్న డౌట్ వస్తోంది. అప్పుడప్పుడూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పెట్టే ప్రెస్ మీట్లు మినహా పెద్దగా కాంగ్రెస్ ఎక్కడా కనిపించడం లేదు. ఇక సొంతపార్టీలోని అంతర్గత పోరుతో ఆ పార్టీ మరింత డీలా పడుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ మరింత బలహీనపడే ఛాన్స్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అసమ్మతితో అవస్థలు

రేవంత్ పీసీసీ అధ్యక్షుడయ్యాక కాంగ్రెస్ పార్టీలో కొన్ని రోజులు జోష్ కనిపించింది. ఇక రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ఏకైక ప్రత్యామ్నాయం తామేనని.. ఆ పార్టీ చెప్పుకున్నది. పలు చోట్ల ఇతర పార్టీ నేతలు కూడా చేరారు. కానీ ఆ తర్వాత బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు కదిలింది. పాదయాత్రలు చేస్తూ.. ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ ప్రజల్లో ఉన్నామని అనిపించుకుంటున్నది.

రేవంత్ వైఖరీ కారణమేనా?

స్వతహాగా దూకుడుగా వ్యవహరించే రేవంత్ రెడ్డి కాస్త.. ఏకపక్షంగా ముందుకు వెళ్తున్నారని కాంగ్రెస్ లోని కొందరు సీనియర్లు భావిస్తున్నారట. కాంగ్రెస్ పార్టీ సహజత్వానికి భిన్నంగా రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలు పోతున్నారని వారు అనుకుంటున్నారని సమాచారం. అందరు నేతలను కలుపుకొని వెళ్లడంలో సీనియర్ నేతలకు సర్దిచెప్పుకోవడంలో రేవంత్ విఫలమవుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.

అయితే పీసీపీ అధ్యక్షుడైన తొలిరోజుల్లో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తున్నట్టు కనిపించిన రేవంత్.. ఆ తర్వాత తనకంటూ ఓ బలమైన గ్రూపును ఏర్పాటు చేసుకోవడంలో దృష్టి పెట్టినట్టు సమాచారం. దీంతో కాంగ్రెస్ సీనియర్లు అలకబూనారు. ఈ విషయం ఇటీవలే అధిష్ఠానం వద్దకు కూడా వెళ్లింది. ఇక నుంచి చేరికల విషయంలో సీనియర్లను సంప్రదించాల్సిందేనని అధిష్టానం సూచించినట్టు సమాచారం. అయితే ఈ ఒడిదొడుకులన్నీ ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎలా ముందుకు వెళ్తుందో వేచి చూడాలి.

First Published:  24 July 2022 8:49 AM GMT
Next Story