Telugu Global
Telangana

తెలంగాణ టైర్-4 పట్టణాల్లో ఊపందుకుంటున్న ఐటీ రంగం

యువ వ్యాపారవేత్తలు ఐటీ విప్లవాన్ని తెలంగాణలోని సెమీ-రూరల్ ప్రాంతాలకు తీసుకొని వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

తెలంగాణ టైర్-4 పట్టణాల్లో ఊపందుకుంటున్న ఐటీ రంగం
X

ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం దూసుకొని పోతోంది. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ఐటీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడంలో సఫలం అవుతోంది. ఐటీ మంత్రి కేటీఆర్ పలు ప్రముఖ అంతర్జాతీయ సంస్థలతో వరుసగా సమావేశమవుతూ.. రాష్ట్రంలో వారి కార్యాలయాల ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. యూకే, యూఎస్ఏ పర్యటనల సందర్భంగా ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలు ఇక్కడ పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఐటీ, ఐటీఈఎస్ రంగాన్ని కేవలం హైదరాబాద్ నగరానికే పరిమితం చేయకుండా.. రాష్ట్రంలోని టైర్-2, టైర్-4 పట్టణాలకు కూడా విస్తరిస్తుండటంతో తెలంగాణ యువతకు సొంత ఊర్లలోనే ఐటీ ఉద్యోగాలు లభిస్తున్నాయి.

యువ వ్యాపారవేత్తలు ఐటీ విప్లవాన్ని తెలంగాణలోని సెమీ-రూరల్ ప్రాంతాలకు తీసుకొని వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారు. చిన్న చిన్న పట్టణాల్లో పెట్టిన ఐటీ కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్‌తో పాటు ఇండియన్ మార్కెట్‌కు సేవలు అందిస్తున్నాయి. కోదాడలో రోబోక్సా అనే ఐటీ కంపెనీని టీ.రమేశ్ ప్రారంభించారు. కొన్నేళ్ల క్రితం సింగపూర్‌లో ఒక ఐటీ సంస్థను స్థాపించారు. అయితే కోదాడ సమీపంలోని తన సొంత గ్రామానికి వచ్చినప్పుడల్లా స్థానిక యువత ఉద్యోగాలు కావాలని అడిగేవారు. దీంతో తానే ఒక యూనిట్ ఇక్కడ ఎందుకు పెట్టకూడదని నిర్ణయించుకొని.. కోదాడ వంటి చిన్న పట్టణంలో ఐటీ కంపెనీని ప్రారంభించినట్లు తెలిపారు.

ఇటీవల బెల్లంపల్లి సందర్శించిన ఐటీ మంత్రి కేటీఆర్.. అక్కడ ఐటీ కంపెనీ నడుస్తుండటం చూసి ఆశ్చర్యపోయారు. సనాతన అనలిటిక్స్ అనే కంపెనీ బెల్లంపల్లిలో విజయవంతంగా కార్యకలాపాలు సాగిస్తోంది. ప్రస్తుతం తమ కంపెనీలో 86 మంది ఐటీ నిపుణులు పని చేస్తున్నట్లు సాయినాథ్ రాజు తెలిపారు. ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఈ కంపెనీని నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు నుంచి అత్యంత నిపుణులైన కోడర్స్‌ను తీసుకొని వచ్చి, కొంత మంది స్థానిక యువకులను కూడా చేర్చుకొని ఐటీ కంపెనీ రన్ చేస్తున్నారు. సనాతన అనలిటిక్స్ కంపెనీ ఈ-కామర్స్ యాప్‌కు ఇప్పటికే 10వేల మంది కస్టమర్లు ఉన్నారు. బెల్లంపల్లి, మంచిర్యాల ప్రాంతంలో ఫుడ్, గ్రోసరీస్ డెలివరీ చేస్తున్నారు. అంతే కాకకుండా ఢిల్లీకి చెందిన ఒక కంపెనీకి బిజినెస్ స్ట్రాటజీ సొల్యూషన్స్‌ను కూడా ఈ సంస్థ అందిస్తున్నట్లు తెలిపారు.

పరకాల కేంద్రంగా డిజియోధ అనే కంపెనీలో 200 మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు. నాలుగేళ్ల క్రితం ప్రారంభించిన ఈ సంస్థ.. ఎమర్జింగ్ టెక్నాలజీస్‌లో ఫార్చ్యూన్ 500 సంస్థలకు సేవలు అందిస్తోందని డిజియోధ వ్యవస్థాపకుడు రాకేశ్ కోకిరాల చెప్పారు. కోవిడ్ పాండమిక్ సమయంలో అనేక మంది వ్యాపారవేత్తల ఆలోచనా ధోరణి మారిపోయిందని చెప్పారు. ప్రపంచంలోని ఎక్కడైనా కూర్చొని పని చేయవచ్చని ఆ సమయంలో అన్ని ఐటీ కంపెనీలు తెలుసుకున్నాయి. అలాంటప్పుడు తక్కువ అద్దెలు ఉండే, నిపుణులు దొరికే చిన్న పట్టణాల్లో కార్యాలయాలు ఎందుకు తెరవకూడదని అనిపించింది. ఈ క్రమంలోనే పరకాలలో ఐటీ కంపెనీ పెట్టినట్లు చెప్పారు. చిన్న పట్టణాల్లోని యువతకు కొంచెం కమ్యునికేషన్, టెక్నికల్ స్కిల్స్ నేర్పిస్తే చాలని.. నగరాల్లో ఉండే ఐటీ నిపుణులకు వారి ఏ మాత్రం తీసిపోరని రాకేశ్ వెల్లడించారు.

రాబోయే రోజుల్లో తెలంగాణలోని చాలా పట్టణాల్లో ఐటీ రంగం మరింతగా విస్తరించే అవకాశం ఉన్నట్లు నిపుణులు తెలియజేస్తున్నారు. తక్కువ అద్దెలు, స్థానికంగా ఉండే యువత కారణంగా ఐటీ కంపెనీ ఎక్కడ పెట్టినా నడిపించగలమనే ధీమా వచ్చిందని వారు అంటున్నారు. ఇదంతా తెలంగాణ ప్రభుత్వం, ఐటీ మంత్రి కేటీఆర్ తీసుకున్న చొరవ కారణంగానే సాకారమైందని అంటున్నారు.

First Published:  23 May 2023 2:14 AM GMT
Next Story