Telugu Global
Telangana

టైర్-2 పట్టణాలకు కూడా ఐటీ రంగం.. రేపు సిద్దిపేట ఐటీ టవర్ ప్రారంభం

ఖమ్మం, మహబూబ్‌నగర్, కరీంనగర్‌లో ఐటీ టవర్లు నిర్మించారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో పలు ఐటీ సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించి స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాయి.

టైర్-2 పట్టణాలకు కూడా ఐటీ రంగం.. రేపు సిద్దిపేట ఐటీ టవర్ ప్రారంభం
X

ఒకప్పుడు ఐటీ అంటే హైదరాబాద్, బెంగళూరు, పూణే, నోయిడా వంటి నగరాలే గుర్తుకు వచ్చేవి. ఉమ్మడి ఏపీలో కూడా పాలకులు ఐటీ రంగాన్ని హైదరాబాద్ నగరానికే పరిమితం చేశారు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఐటీ రంగ విస్తరణకు అనేక చర్యలు చేపట్టింది. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో ఐటీ మంత్రి కేటీఆర్ ఐటీ రంగంలో భారీ పెట్టుబడులను తీసుకొని వచ్చారు. ఐటీ, ఐటీఈఎస్ రంగాన్ని కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా టైర్-2 పట్టణాలకు కూడా విస్తరిస్తున్నారు.

ఇప్పటికే ఖమ్మం, మహబూబ్‌నగర్, కరీంనగర్‌లో ఐటీ టవర్లు నిర్మించారు. ఆయా ప్రాంతాల్లో పలు ఐటీ సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించి స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాయి. ఇక త్వరలో నల్గొండ,నిజామాబాద్‌లో ఐటీ టవర్లు ప్రారంభం కానున్నాయి. నల్గొండలో పెట్టుబడులు పెట్టడానికి అమెరికాకు చెందిన కంపెనీ ఇటీవల ఒప్పందం కూడా కుదుర్చుకున్నది. తాజాగా సిద్దిపేట ఐటీ టవర్ నిర్మాణం పూర్తయ్యింది. గురువారం (జూన్15) ఐటీ మంత్రి కేటీఆర్, ఆర్థిక మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా ఈ ఐటీ టవర్ ప్రారంభం కానున్నది.

సిద్దిపేట పట్టణ శివారు.. రాజీవ్ రహదారిని ఆనుకొని నాగులబండ వద్ద ఐటీ టవర్‌ను నిర్మించారు. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ) అధునాత సౌకర్యాలతో కూడిన టవర్‌ను నిర్మించింది. ఐటీ టవర్‌కు సమీపంలోనే పోలీస్ కమిషనరేట్, కలెక్టరేట్, త్రీస్టార్ హోటల్స్, అర్బన్ ఫారెస్ట్ పార్కులు, ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఉన్నాయి. రూ.63 కోట్ల వ్యయంతో 4 అంతస్థుల్లో ఐటీ టవర్ నిర్మించారు.

సిద్దిపేట ఐటీ టవర్‌లో కార్యకలాపాలు నిర్వహించేందుకు పలు ఐటీ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు జాబ్ మేళాలు నిర్వహించి కొత్త కొలువులను అందించాయి. స్థానిక యువత కూడా సిద్దిపేట ఐటీ టవర్‌లో పని చేయడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఈ ఐటీ టవర్ నిర్మాణం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 2వేల మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

'టెక్నాలజీ ఉద్యోగ అవకాశాలను తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ క్రమంలోనే సిద్దిపేటలో నిర్మించిన ఐటీ హబ్‌ను బుధవారం మంత్రి హరీశ్ రావుతో కలిసి ప్రారంభించనున్నాను' అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. జూలైలో నిజామాబాద్, అగస్టులో నల్గొండ ఐటీ హబ్స్ ప్రారంభం కానున్నట్లు ఆయన తెలిపారు.


First Published:  14 Jun 2023 4:19 AM GMT
Next Story