Telugu Global
Telangana

వివేక్ వెంకట స్వామి ఇంట్లో ఐటీ సోదాలు..

ఐటీ సోదాలపై కాంగ్రెస్ నేతలు ,కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాలలోని వివేక్ వెంకటస్వామి ఇంటి దగ్గర ఆందోళనకు దిగారు.

వివేక్ వెంకట స్వామి ఇంట్లో ఐటీ సోదాలు..
X

తెలంగాణ ఎన్నికల వేళ.. ఎప్పుడు ఏ అభ్యర్థి ఇంటికి ఐటీ అధికారులు వస్తారో తెలియడంలేదు. ఉదయాన్నే ఐటీ సోదాలు మొదలవుతున్నాయి. మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిని ఐటీ అధికారులు టార్గెట్ చేయడంతో తెలంగాణలో కలకలం రేగింది. ఇటీవలే బీజేపీని వదిలి కాంగ్రెస్ లో చేరి చెన్నూర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వివేక్ వెంకట స్వామి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు మొదలుపెట్టారు. నిన్న రాత్రి నుంచి ఆయన అనుచరులను టార్గెట్ చేసిన అధికారులు, ఈ రోజు ఉదయాన్నే ఆయన నివాస గృహాలకు కూడా వచ్చారు. అటు హైదరాబాద్, ఇటు మంచిర్యాలలో.. రెండు టీమ్ లు వివేక్ ఇళ్లలో సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టాయి.

ఐటీ సోదాలపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాలలోని వివేక్ వెంకటస్వామి ఇంటి దగ్గర ఆందోళనకు దిగారు. కావాలనే తమపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఓటమి భయంతోనే ఐటీ, పోలీసులతో దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు హైదరాబాద్ లోని ఆయన నివాసం వద్ద కూడా కాంగ్రెస్ కార్యకర్తలు గుమికూడారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇటీవలే వివేక్ వెంకట స్వామికి చెందిన బ్యాంక్ అకౌంట్లపై ఎన్నికల కమిషన్ అధికారులు నిఘా పెట్టారు. ఆయనకు చెందిన విశాఖ ఇండస్ట్రీస్ కంపెనీ లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ కంపెనీ అకౌంట్ నుంచి ఓ మ్యాన్ పవర్ కంపెనీకి బదిలీ అయిన రూ.8కోట్లను ఈసీ ఆదేశాలతో బ్యాంక్ అధికారులు ఫ్రీజ్ చేశారు. ఇప్పుడు ఏకంగా ఆయన ఇంటిపై ఐటీ రైడ్ జరుగుతోంది. ఈ సోదాల్లో ఏం తేలుతుందో వేచి చూడాలి.


First Published:  21 Nov 2023 2:14 AM GMT
Next Story