Telugu Global
Telangana

హైదరాబాద్‌లో ఐటీ రైడ్స్ కలకలం.. మహేశ్వరం కాంగ్రెస్ నేతల ఇళ్లలో సోదాలు

కేఎల్ఆర్ నివాసం, మాదాపూర్‌లోని కార్యాలయంలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

హైదరాబాద్‌లో ఐటీ రైడ్స్ కలకలం.. మహేశ్వరం కాంగ్రెస్ నేతల ఇళ్లలో సోదాలు
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం సిద్ధపడుతుండగానే కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో ఐటీ రైడ్స్ కలకలం సృష్టిస్తున్నాయి. ఆదాయపు పన్ను శాఖ అధికారులు శుక్రవారం ఉదయాన్నే ఏక కాలంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల ఇళ్లపై దాడులు చేశారు. ముఖ్యంగా మహేశ్వరం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్) నివాసం, ఆఫీసులతో పాటు.. మహేశ్వరం టికెట్ ఆశించిన బడంగ్‌పేట్ మేయర్ పారిజాత ఇంటిలో కూడా సోదాలు జరుగుతున్నాయి.

కేఎల్ఆర్ నివాసం, మాదాపూర్‌లోని కార్యాలయంలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆయనకు చెందిన విద్యా సంస్థల కార్యాలయాలపై కూడా దాడులు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. కేఎల్ఆర్ ఇటీవల రియల్ ఎస్టేట్ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టారు. ఈ సమాచారం అందుకున్నందునే ఐటీ అధికారులు దాడులు చేస్తున్నట్లు తెలుస్తున్నది.

ఇక బాలాపూర్‌లో ఉన్న మేయర్ చిగిరింత పారిజాత ఇంటికి ఉదయాన్నే ఐటీ అధికారులు వెళ్లారు. ఆ సమయంలో పారిజాత కూతురు మాత్రమే ఇంటిలో ఉన్నట్లు తెలుస్తున్నది. పారిజాత తిరుపతిలో ఉండగా.. ఆమె భర్త నర్సింహారెడ్డి ఢిల్లీలో ఉన్నారు. కేఎల్‌ఆర్‌కు టికెట్ కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ.. మహేశ్వరం బీఫామ్ తన భార్యకే ఇవ్వాలనే లాబీయింగ్ చేయడానికి ఢిల్లీకి వెళ్లినట్లు తెలిసింది. ఇంటిలో ఉన్న పారిజాత కూతురు నుంచి ఐటీ అధికారులు ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. పారిజాత కుటుంబం, బంధువులు, కార్యాలయాలు కలిపి మొత్తం 10 ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

మరోవైపు ఇటీవల గణేష్ ఉత్సవాల సందర్భంగా బాలాపూర్ లడ్డూను దక్కించుకున్న బీఆర్ఎస్ నాయకుడు వంగేటి లక్ష్మారెడ్డి ఇంటిలో కూడా సోదాలు జరుగుతున్నాయి. ఆయన ఇంటితో పాటు కార్యాలయంలో ఐటీ బృందాలు సోదాలు చేస్తున్నాయి. కాగా, హైదరాబాద్‌లో జరుగుతున్న ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. గతంలో కూడా రాజకీయ నాయకుల ఇళ్లపై ఐటీ దాడులు జరిగాయి. కానీ ఎన్నికల సమయంలో ఇలాంటి దాడులు జరగడం ఇదే మొదటిసారని అంటున్నారు. కాగా, ఐటీ దాడులకు సంబంధించిన మరిన్ని వివరాలు అందాల్సి ఉన్నది.

First Published:  2 Nov 2023 3:08 AM GMT
Next Story