Telugu Global
Telangana

దేవుళ్లకు ఐటీ నోటీసులు.. మండిపడుతున్న భక్తులు

ఐటీ నోటీసులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార సంస్థలు, వ్యక్తుల విషయంలో వ్యవహరించినట్టు ఆలయాలపై కఠిన వైఖరిని అవలంబించడం సరైంది కాదంటున్నారు.

దేవుళ్లకు ఐటీ నోటీసులు.. మండిపడుతున్న భక్తులు
X

కొమురవెల్లి మల్లన్న - రూ.8కోట్లు ఇన్ కమ్ ట్యాక్స్ బాకీ.. రూ.3కోట్లు జరిమానా

బాసర సరస్వతి దేవి - పన్ను చెల్లించలేదు

వేములవాడ రాజన్న - ఇన్ కమ్ ట్యాక్స్ కట్టాల్సిందే

తెలంగాణలోని పలు ఇతర దేవాలయాలకు కూడా ఇలాగే ఐటీ తాఖీదులందాయి. ఇందులో కొమురవెల్లి మల్లన్న ఆలయానికి విధించిన పన్ను, జరిమానా అత్యథికం.


2016-17 ఆర్థిక సంవత్సరంలో ఆలయానికి వచ్చిన ఆదాయంపై పన్ను కట్టాలని నోటీసుల్లో పేర్కొన్నారు అధికారులు. ఐటీ చట్టం సెక్షన్ 147 కింద రూ.8,64,49,041 పన్ను చెల్లించాల్సి ఉందని, ఆ పన్ను సకాలంలో చెల్లించనందుకు ఐటీ చట్టంలోని సెక్షన్‌ 271 (1) సి ప్రకారం రూ.3,49,71,341, సెక్షన్‌ 271(1) డి ప్రకారం మరో రూ.20వేలు, సెక్షన్ 271 (ఎఫ్‌) కింద మరో రూ.5 వేలు జరిమానాలుగా చెల్లించాలని, మొత్తంగా రూ.12 కోట్లకుపైగా సొమ్మును తక్షణం చెల్లించాలని హైదరాబాద్‌ సర్కిల్‌ ఆదాయ పన్ను శాఖ కొమురవెల్లి మల్లన్న ఆలయానికి నోటీసులు ఇచ్చింది.

వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి, బాసర సరస్వతి అమ్మవారి ఆలయానికి కూడా ఐటీ నోటీసులందాయి. తెలంగాణలోని పలు ఇతర ఆలయాలకు కూడా ఈరోజు నోటీసులు వచ్చినట్టు తెలుస్తోంది. ఐటీ నోటీసులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార సంస్థలు, వ్యక్తుల విషయంలో వ్యవహరించినట్టు ఆలయాలపై కఠిన వైఖరిని అవలంబించడం సరైంది కాదంటున్నారు. పన్నులు ఎగ్గొట్టే బడా వ్యాపారులను వదిలిపెట్టి ఆధ్యాత్మిక కేంద్రమైన దేవాలయాకు పన్ను కట్టాలని నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు.

మోదీ ద్వంద్వనీతి..

హిందూజన పరిరక్షకులుగా తమని తాము ప్రొజెక్ట్ చేసుకునే బీజేపీ హయాంలోని కేంద్ర ప్రభుత్వం, ఇలా హిందూ ఆలయాలకు నోటీసులివ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఆలయాలపై బీజేపీ ప్రేమ అంతా నటనేనని, కపట ప్రేమ అని రుజువైందని విమర్శించారు.

First Published:  5 Oct 2023 7:11 AM GMT
Next Story