Telugu Global
Telangana

ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత మనదే.. వార్డు ఆఫీసర్లతో మంత్రి కేటీఆర్

మనకు స్వపరిపాలన వచ్చి 9 ఏళ్లు అయ్యింది. ఇక ఇప్పుడు సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు.

ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత మనదే.. వార్డు ఆఫీసర్లతో మంత్రి కేటీఆర్
X

ప్రభుత్వం నుంచి ప్రజలు కిలోల కొద్దీ బంగారం కోరుకోరు. నీళ్ళు వచ్చాయా, కరెంటు వచ్చిందా, చెత్త తీసుకెళ్తున్నారా, రోడ్లు బాగున్నాయా, ఇంటి దగ్గర పార్కు ఉన్నదా అనే చిన్న విషయాలనే కోరుకుంటారు. వాటిని మనం సక్రమంగా అందజేయగలిగితే ప్రభుత్వ పరంగా విజయం సాధించినట్లే అని మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జూన్ 16 నుంచి జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో వార్డు సచివాలయాలను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో పని చేయనున్న ఆఫీసర్లకు ఇంటరాక్షన్ సెషన్ హైటెక్స్ వేదికగా నిర్వహంచారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు..

మనకు స్వపరిపాలన వచ్చి 9 ఏళ్లు అయ్యింది. ఇక ఇప్పుడు సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. హైదరాబాద్ వంటి మహానగరంలో 1.20 కోట్ల మంది ప్రజలు నివశిస్తున్నారు. వారికి ఉండే ప్రాథమిక సమస్యలు పరిష్కరించడానికే వార్డు ఆఫీసులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. హైదరాబాద్‌లోని ఒక డివిజన్.. దాదాపు ఒక మున్సిపాలిటీతో సమానమైన జనాభా కలిగి ఉంటుంది. జీహెచ్ఎంసీ పరిధిలో జోన్లు, సర్కిళ్లు ఉన్నాయి. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం ప్రజలకు అందుబాటులో ఉండే అధికారులు లేరు. ఆ గ్యాప్‌ను భర్తీ చేయడానికే వార్డు ఆఫీసులు ప్రారంభిస్తున్నామని మంత్రి చెప్పారు.

ప్రజల సమస్యల పరిష్కారానికి, మరింత ఉన్నతమైన సేవలు అందించేందుకు ప్రతీ వార్డు ఆఫీసులో పది మంది వివిధ శాఖలకు చెందిన అధికారులు పని చేస్తారని మంత్రి చెప్పారు. ఈ వార్డు అధికారులు సమస్యలను పరిష్కరించడమే కాకుండా.. ప్రజలను చైతన్యవంతులను కూడా చేయాలి. ఆ బాధ్యత కూడా వార్డు అధికారులపై ఉంటుంది. ప్రజల సహకారం ఉంటేనే హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకొని వెళ్లగలమని అన్నారు.

హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి గుండె వంటిది. తెలంగాణలో దాదాపు 4 కోట్ల మంది జనాభా ఉంటే.. ఒక్క హైదరాబాద్ నగరపరిధిలోనే 1.20 కోట్ల మంది ఉన్నారని మంత్రి చెప్పారు. ఇంత మంది జనాభాకు సుపరిపాలన అందాలంటే.. పరిపాలనా వికేంద్రీకరణే సరైన పరిష్కారం. ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాలను వేగవంతంగా తీసుకొని వెళ్లడానికి కొత్త జిల్లాలు, మండలాలు, పంచాయతీలు ఎలాగైతే ఏర్పాటు చేసుకున్నామో.. అదే రీతిన ఈ వార్డు ఆఫీసులను ప్రారంభించుకుంటున్నామని అన్నారు.

వార్డు కార్యాలయం ద్వారా ఆచరణాత్మకమైన లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని కేటీఆర్ పిలుపునిచ్చారు. 2014 నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్ నగరం గణనీయమైన అభివృద్ధి సాధించిందని అన్నారు. కొత్త రోడ్లు, ఫ్లైవోవర్లు, నాలాలు నిర్మించుకొని విశ్వనగరంగా ఎదుగుతున్నామని చెప్పారు. ఇందుకు సహకరించిన జీహెచ్ఎంసీలోని ప్రతీ అధికారికి ధన్యవాదాలు తెలిపారు.

హైదరాబాద్ నగర వ్యాప్తంగా 8వేల మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఇందులో ఆరు రకాలైన చెత్తను వేరు చేసి సమర్థవంతంగా రీసైకిల్ చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. సెప్టెంబర్ నాటికి పూర్తి స్థాయిలో లిక్విడ్ వేస్ట్ మేనే‌జ్‌మెంట్ చేస్తున్న నగరంగా హైదరాబాద్ రికార్డు సృష్టించబోతోందని అన్నారు.

వార్డు ఆఫీసులో ఉండే వారు ప్రజలతో సావధానంగా మాట్లాడాలని.. చికాకు పడకుండా వారి సమస్యలను అర్థం చేసుకోవాలని కోరారు. పక్క వార్డు వాళ్లు వచ్చి ఫిర్యాదు ఇచ్చినా తీసుకోవాలని.. వారిని కసురుకొని వేరే దగ్గరకు వెళ్లమని చెప్పొద్దని మంత్రి సూచించారు. ప్రతీ ఫిర్యాదును తీసుకొని నెంబర్ కేటాయించాలని, వేరే వార్డు సమస్యలను అక్కడకు ఫార్వర్డ్ చేయాలని చెప్పారు.

మనం ట్రిపుల్ ఆర్ మంత్రాన్ని పాటిద్దాము. రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్ అనే పద్దతిని పాటిస్తూ హైదరాబాద్ నగరాన్ని అందంగా తీర్చిదిద్దుదామని అన్నారు. ఈ నెల 16న అన్ని ప్రాంతాల్లో ఒకే సారి 150 వార్డులను ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. అన్ని జోనల్ కమిషనర్లు వార్డు వ్యవస్థ ఒక గాడిలో పడే వరకు పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు.


First Published:  10 Jun 2023 9:13 AM GMT
Next Story