Telugu Global
Telangana

బీజేపీకి అంత సీనుందా?

అసలు బీజేపీతో పొత్తు పెట్టుకునే పార్టీ ఏదన్నా ఉందా? అధికార బీఆర్ఎస్ పార్టీ బద్ద శత్రువు. బీఆర్ఎస్‌ను ఓడించటమే ఏకైక లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తున్నది కాబట్టి పొత్తు ప్రస్తావనే రాదు.

బీజేపీకి అంత సీనుందా?
X

రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తుందని పార్టీ చీఫ్ బండి సంజయ్ ప్రకటించారు. ఇక్కడే బండి ప్రకటన విచిత్రంగా ఉంది. ఏ పార్టీతోనూ బీజేపీ పొత్తు పెట్టుకోదన్నారు బాగానే ఉంది. అసలు బీజేపీతో పొత్తు పెట్టుకునే పార్టీ ఏదన్నా ఉందా? అధికార బీఆర్ఎస్ పార్టీ బద్ద శత్రువు. బీఆర్ఎస్‌ను ఓడించటమే ఏకైక లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తున్నది కాబట్టి పొత్తు ప్రస్తావనే రాదు.

ఇక బీజేపీతో పాటు అధికారంలోకి వచ్చేయాలని ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ కూడా ప్రధాన శత్రువే. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీయే అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రకటనలు అందరికీ తెలిసిందే. ఇక మిగిలింది ఎంఐఎం, వామపక్షాలు. ఎంఐఎంతో ఎలాగూ పొత్తుండదని అందరికీ తెలిసిందే. వామపక్షాలతో పొత్తు గురించిన ఆలోచన కూడా ఉండదు. ఇక మిగిలిన పార్టీలన్నీ చిన్నా చితకావే. వాటి గురించి జనాల్లోనే పెద్దగా చర్చ జరగటంలేదు. కాబట్టి వాటితో పొత్తుపై బీజేపీ ఎలాగూ ఆలోచించదు.

క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఇలాగుంటే ప్రత్యేకించి ఏ పార్టీతోనూ పొత్తుండదని బండి సంయజ్ చెప్పటంలో అర్థ‌మేంటి . అప్పటికేదో పది పార్టీలు పొత్తు కోసం బీజేపీ వెంటపడుతున్నట్లుంది బండి తాజా ప్రకటన. పైగా వంద సీట్లలో తమకు బలమైన అభ్యర్థులున్నారని ప్రకటించటమే చాలా విచిత్రంగా ఉంది. 119 నియోజకవర్గాల్లోనూ పోటీ చేయటానికి అభ్యర్థులైతే ఉంటారు. కానీ వాళ్ళల్లో ప్రత్యర్ధులకు ధీటుగా పోటీలో నిలిచేంత కెపాసిటి ఎందరికి ఉంటుంది?

అందుబాటులోని సమాచారం ప్రకారం గట్టి అభ్యర్థులు అనుకున్న నేతలు బీజేపీలో మహా అయితే 30 మందికన్నా ఉండరు. మిగిలిన నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్థులు ఎవరంటే టార్చిలైటు వేసి వెతకాల్సిందే. అందుకనే పక్క పార్టీల్లోని గట్టి నేతల కోసం గాలమేస్తున్నది. అన్నీ నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్థులు లేనప్పుడే బీజేపీ ఎగిరెగిరి పడుతోంది. అదే అన్నీ నియోజకవర్గాల్లోను బలమైన అభ్యర్థులు ఉంటే ఇక వీళ్ళని ఆపటం ఎవరితరం కాదేమో. కాబట్టి పొత్తుల గురించి కాకుండా ముందు గట్టి అభ్యర్థుల విషయంపై బండి దృష్టి పెడితే బాగుంటుంది.

First Published:  2 March 2023 6:51 AM GMT
Next Story