Telugu Global
Telangana

రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లోకి తిరిగి రావడం ఖాయమేనా? కాంగ్రెస్ ఇచ్చిన ఆఫర్ ఏంటి?

తమ్మడు రాజగోపాల్ రెడ్డి మునుగోడులో గెలిచి ఉంటే.. వెంకట్ రెడ్డి కూడా బీజేపీ జాయిన్ అయ్యే వాడనే ప్రచారం జరిగింది.

రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లోకి తిరిగి రావడం ఖాయమేనా? కాంగ్రెస్ ఇచ్చిన ఆఫర్ ఏంటి?
X

కోమటిరెడ్డి బ్రదర్స్‌ అంటే నల్గొండ జిల్లాలో ఒక క్రేజ్ ఉంటుంది. జిల్లా రాజకీయాలను ఈ అన్నదమ్ములు శాసిస్తారనే పేరు ఉండేది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా.. వీరిద్దరు మాత్రం ఏదో ఒక నియోజకవర్గంలో గెలుస్తూ వచ్చారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేసి ఓడిపోయినా భువనగిరి ఎంపీగా గెలిచాడు. ఇక తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ పెరుగుతున్నదని అంచనా వేసుకొని.. ఆ పార్టీలో చేరడమే కాకుండా.. ఉపఎన్నికకు వెళ్లి రాజగోపాల్ రెడ్డి బొక్కా బోర్లా పడ్డారు.

తమ్మడు రాజగోపాల్ రెడ్డి మునుగోడులో గెలిచి ఉంటే.. వెంకట్ రెడ్డి కూడా బీజేపీ జాయిన్ అయ్యే వాడనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు వెంకట్ రెడ్డి సైలెంట్‌గా కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌ను వదిలేసిన రాజగోపాల్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్‌పై పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల కొంత మంది బీజేపీలోని వలస నాయకులతో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జితేందర్ రెడ్డి వంటి నాయకులు ఈ సమావేశంలో పాల్గొని.. బీజేపీలో కొనసాగడా లేదా పార్టీ మారడమా అనే విషయాలపై చర్చించినట్లు సమాచారం. బీజేపీలో తమకు తగిన ప్రాధాన్యత ఉండటం లేదని.. రేపు టికెట్ ఇచ్చినా ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయని అంచనాకు వచ్చారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ లోకి తిరిగి రావాలని బలంగా కోరుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే తమ్ముడి చేరికపై అధిష్టానం వద్ద కూడా చర్చించినట్లు సమాచారం. కాగా, రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరితే ఎల్బీనగర్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ నాయకులకు కూడా చెప్పినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ఎల్బీనగర్ నుంచి మల్‌రెడ్డి రాంరెడ్డి, మధు యాష్కి గౌడ్ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో ఇద్దరు నాయకులు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

కాగా, ఎల్బీనగర్ పరిధిలో నల్గొండ జిల్లా సెటిలర్స్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అందులో రెడ్డి సామాజిక వర్గం ఓట్లు కూడా ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయి. అందుకే రాజగోపాల్ రెడ్డి ఎల్బీనగర్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. కాగా, కాంగ్రెస్ నాయకత్వం మాత్రం మునుగోడు అసెంబ్లీ టికెట్ ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఎల్బీనగర్ టికెట్ కావాలంటే సర్వే రిపోర్టు ఆధారంగానే కేటాయిస్తామని స్పష్టం చేసినట్లు సమాచారం. ముందుగా అయితే మునుగోడులో పోటీకి సిద్ధమయితే ఓకే అని వెంకట్ రెడ్డి ద్వారా రాజగోపాల్‌కు సమాచారం పంపినట్లు తెలుస్తున్నది. మరి ఇందుకు రాజగోపాల్ రెడ్డి ఒప్పుకుంటారా? లేదంటే బీజేపీ నుంచే ఎల్బీనగర్ టికెట్ తెచ్చకుంటారా అనేది వేచి చూడాలి.

First Published:  28 Sep 2023 6:05 AM GMT
Next Story