Telugu Global
Telangana

ప్రియాంక గాంధీనే తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జా? అధికారికంగా ఎందుకు ప్రకటించడం లేదు?

మాణిక్యం ఠాకూర్‌ను తొలగించి పూర్తిగా ప్రియాంకకు బాధ్యతలు అప్పగిస్తారనే వార్తలు వచ్చాయి. కానీ అధిష్టానం అనూహ్యంగా మాణిక్ రావ్ ఠాక్రేను ఇంచార్జిగా నియమించింది.

ప్రియాంక గాంధీనే తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జా? అధికారికంగా ఎందుకు ప్రకటించడం లేదు?
X

తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జిగా అనధికారికంగా ప్రియాంక గాంధీ వ్యవహరిస్తున్నారా? పేరుకు మాణిక్ రావ్ ఠాక్రే ఇంచార్జి అయినా.. అన్నీ తానై నడిపిస్తున్నారా? అంటే రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానమే వస్తోంది. తెలంగాణలో ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దక్షిణాదిన కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్... తర్వాత టార్గెట్‌గా తెలంగాణను ఎంచుకున్నది. గతంలో రాహుల్ గాంధీ టీపీసీసీకి సంబంధించిన వ్యవహారాలను చూసే వారు. సీనియర్లు, కొత్తగా పార్టీలో చేరిన వారికి వచ్చిన విభేదాలను పరిష్కరించడంలో చొరవ చూపించారు. అయితే, ప్రస్తుతం తెలంగాణ వ్యవహారాలన్నీ ప్రియాంక గాంధీ చూస్తున్నట్లు తెలుస్తున్నది.

తెలంగాణ వ్యవహారాల ఇంచార్జిగా మాణిక్యం ఠాకూర్ పని చేసే కాలంలో సీనియర్లకు ఆయనకు మధ్య విభేదాలు తలెత్తాయి. మాణిక్యం ఠాకూర్ పూర్తిగా రేవంత్ రెడ్డి మాటే వింటున్నారని.. ఆయన రేవంత్ తొత్తుగా మారాడని బహిరంగంగానే విమర్శించారు. అప్పుడే మాణిక్యం ఠాకూర్‌ను తొలగించి పూర్తిగా ప్రియాంకకు బాధ్యతలు అప్పగిస్తారనే వార్తలు వచ్చాయి. కానీ అధిష్టానం అనూహ్యంగా మాణిక్ రావ్ ఠాక్రేను ఇంచార్జిగా నియమించింది. ఆయన టీపీసీసీ వ్యవహారాల్లో పెద్దగా తలదూర్చడం లేదు. ప్రియాంక గాంధీనే అనధికారికంగా తెలంగాణ వ్యవహారాలు చూస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రియాంక గాంధీ గతంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బాధ్యతలను తీసుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీని గెలిపించలేక పోయారు. దీంతో ఆమెపై పార్టీలో ఒక వర్గం బహిరంగంగానే విమర్శించారు. ఇక ఇప్పుడు తెలంగాణ బాధ్యతలను అధికారికంగా తీసుకోవడానికి గాంధీ కుటుంబం సంశయిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నది. కేసీఆర్‌ను తట్టుకొని బలంగా నిలబడి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొని రావడం చాలా కష్టమైన టాస్కే. అలాంటప్పుడు ప్రియాంకను ముందు పెట్టి ఎన్నికలకు వెళ్లి.. తీరా ఓడిపోతే మరోసారి ఆమెపై పార్టీలో వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందని అధిష్టానం భావిస్తోంది. కర్ణాటకలో డీకే శివకుమార్, సిద్ధి రామయ్య కలిసి అధికారంలోకి తీసుకొని వచ్చారు. అక్కడ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఎఫెక్ట్ కూడా కాస్త పని చేసింది. కానీ తెలంగాణలో పరిస్థితులు పూర్తిగా వేరు.

తెలంగాణలో సీనియర్లు, జూనియర్ల అంటూ రెండు వర్గాలుగా విడిపోయి ఉన్నారు. ముందు వీళ్లను ఒకటి చేయడమే పెద్ద పని. తాను తగ్గి ఉంటానని, అందరినీ కలుపుకొని పోతానని రేవంత్ రెడ్డి పదే పదే వ్యాఖ్యలు చేసినా పెద్దగా ఫలితం ఉండటం లేదు. దీంతో ప్రియాంక గాంధీ పరోక్షంగా తెలంగాణ వ్యవహారాలు చూస్తున్నట్లు తెలుస్తున్నది. టీపీసీసీ తాజాగా 150 రోజుల ప్రీపోల్ క్యాంపెయిన్ ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రతీ 15 రోజులకు ఒకసారి ప్రియాంక గాంధీ రాష్ట్రంలో పర్యటించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఆమె తెలంగాణ వ్యవహారాలు చూస్తున్నందు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. బయటకు చెప్పకపోయినా.. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చే బాధ్యత ఆమెకే అప్పగించినట్లు సమాచారం. కాకపోతే ఇక్కడ ఫలితాలు ఎలా ఉంటాయో అనే అనుమానంతోనే అధికారికంగా ప్రకటించడం లేదని తెలుస్తున్నది.

First Published:  23 May 2023 3:30 AM GMT
Next Story