Telugu Global
Telangana

కోమటిరెడ్డిని సైలెంట్‌గా సైడ్ చేస్తున్నారా?

తెలంగాణ కాంగ్రెస్‌లో మొదటి నుంచి అసంతృప్తి స్వరం వినిపిస్తున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇటీవల సైలెంట్ అయ్యారు. టీసీపీపీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో పాటు ఇతర సీనియర్లతో కలిసిపోయినట్లే కనపడుతున్నారు.

కోమటిరెడ్డిని సైలెంట్‌గా సైడ్ చేస్తున్నారా?
X

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి పార్టీలో ప్రాధాన్యత తగ్గుతున్నదా? టీపీసీసీ ప్రెసిండెంట్ రేవంత్ రెడ్డి సైలెంట్‌గా కోమటిరెడ్డిని పక్కకు పెడుతున్నారా? టికెట్ల కేటాయింపు, చేరికల విషయంలో కోమటిరెడ్డి వ్యవహార శైలిపై అధిష్టానానికి ఫిర్యాదు అందిందా? ఢిల్లీ పెద్దల ఆశీస్సుల తోనే కోమటిరెడ్డి కాదని ఆయన నియోజకవర్గం పరిధిలో రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారా? అవుననే సమాధానమే వస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్‌లో మొదటి నుంచి అసంతృప్తి స్వరం వినిపిస్తున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇటీవల సైలెంట్ అయ్యారు. టీసీపీపీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో పాటు ఇతర సీనియర్లతో కలిసిపోయినట్లే కనపడుతున్నారు. ఇటీవల తనను ఏ కమిటీలో కూడా తీసుకోలేదని కాస్త అలిగినా.. తర్వాత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డిని కాదని కొన్ని నిర్ణయాలను కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఉమ్మడి నల్గొండ పరిధిలో చేరికలపై తన నిర్ణయం తప్పకుండా తీసుకోవాలని గతంలో రాష్ట్ర నాయకులకు కోమటిరెడ్డి చెప్పారు. జిట్టా బాలకృష్ణారెడ్డి, మందుల సామేలు విషయంలో కోమటిరెడ్డే చొరవ తీసుకొని పార్టీ కండువా కప్పారు.

కాగా, మరి కొంత మంది కీలక నాయకుల విషయంలో మాత్రం కోమటిరెడ్డి వ్యతిరేకత చూపించారు. దీంతో కాంగ్రెస్ ముఖ్యనేత కేసీ వేణుగోపాల్.. కోమటిరెడ్డిని పిలిచి మందలించినట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీలో చేరిక విషయంలో తలదూర్చ వద్దని.. ఇప్పుడు కీలక నేతల అవసరం ఉన్నదని సున్నితంగానే చెప్పినట్లు సమాచారం. ముఖ్యంగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పార్టీలో చేరడానికి కోమటిరెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి అధిష్టానానికి తెలియజేశారు. దీంతో కోమటిరెడ్డిని చేరికల విషయంలో దూరంగా ఉండాలని చెప్పినట్లు సమాచారం.

ఇక యాదాద్రి భువనగిరి జిల్లా మాజీ డీసీసీ ప్రెసిడెంట్ కుంభం అనిల్ కుమార్ విషయంలో కూడా కోమటిరెడ్డికి తెలియకుండానే రేవంత్ వ్యవహారం నడిపినట్లు తెలిసింది. కొన్ని వారాల క్రితం కుంభం అనిల్ కుమార్.. కోమటిరెడ్డి కారణంగానే తాను పార్టీని వీడిపోతున్నట్లు చెప్పారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి స్వయంగా కుంభం ఇంటికి వెళ్లి చర్చలు జరిపినట్లు తెలుస్తున్నది. పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న సమయంలో ఇలా వెళ్లిపోవడం బాలేదని నచ్చచెప్పారు. దీంతో కుంభం తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కుంభం అనిల్ పార్టీలో చేరే వరకు కోమటిరెడ్డికి అసలు విషయమే తెలియదని సమాచారం.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో గెలుపులో భాగం అయ్యే ఏ ఒక్క నాయకుడిని కూడా వదులుకోవద్దని అధిష్టానం సీరియస్‌గా చెప్పడంతో రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తే.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కాస్త పక్కన పట్టి.. రేవంత్ రెడ్డే నల్గొండ జిల్లా వ్యవహారాలు నడిపిస్తున్నట్లు సమాచారం.

First Published:  27 Sep 2023 3:29 PM GMT
Next Story