Telugu Global
Telangana

బీహార్ రాజకీయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోనున్న కేసీఆర్?

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్.. ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.

బీహార్ రాజకీయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోనున్న కేసీఆర్?
X

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్.. ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నాళ్ల నుంచో బీజేపీ, ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా ఒక బలమైన రాజకీయ శక్తిని తయారు చేయాల్సిన అవసరం ఉందని కేసీఆర్ చెప్తున్నారు. గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ అనే జాతీయ పార్టీని పెడతారనే వార్తలు వచ్చాయి. మరోసారి ఆయన కూటమి ఏర్పాటు చేస్తారని కూడా ఊహాగానాలు వినిపించాయి. కానీ, కేసీఆర్ ఈ మధ్య అసలు జాతీయ రాజకీయాలకు సంబంధించిన ఊసే ఎత్తలేదు.

ఇటీవల బీజేపీ, మోడీ ప్రభుత్వంపై కేసీఆర్ విమర్శల జోరు పెంచారు. తెలంగాణ రాష్ట్రానికి ఎలా అన్యాయం చేస్తోందో లెక్కలతో సహా వివరించారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉండగానే కేసీఆర్‌కు ఒక చక్కని అవకాశం లభించింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న కేసీఆర్‌కు బీజేపీ రాజకీయాలు కొత్త ఆశలు రేపుతున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా మమత బెనర్జీ, అరవింద్ కేజ్రివాల్, స్టాలిన్ వంటి నాయకులను ఏకం చేయాలని గతంలో కేసీఆర్ భావించారు. మమత ఏ సమయంలో ఎటువైపు వెళ్తుందో తెలియని పరిస్థితి. ఇక స్టాలిన్‌కు తన సొంత అజెండా ఉంది. దీంతో కేసీఆర్‌కు సరైన తోడు లభించడం లేదు.

తాజాగా బీహార్ సీఎం నితీశ్ కుమార్ బీజేపీ స్నేహాన్ని వదిలేశారు. ఆర్జేడీతో కలసి మహాఘటబంధన్ పేరుతో కూటమి కట్టారు. నితీశ్ కుమార్ వెళ్లిపోవడం ఎన్డీయే కూటమికి పెద్ద ఎదరు దెబ్బే అని కొన్ని సర్వేలు తెలిపాయి. నితీశ్ కారణంగా బీజేపీ కూటమికి 20 వరకు ఎంపీ సీట్లు తగ్గిపోతాయని తెలుస్తున్నది. దీంతో తన జాతీయ రాజకీయాల ప్రయాణంలో నితీశ్ తప్పకుండా ప్లస్ అవుతారని కేసీఆర్ భావిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టడానికి ఉన్న ఏ అవకాశాన్ని కేసీఆర్ వదులుకోవడానికి సిద్దంగా లేరు. అయితే గతంలో బీజేపీ, కాంగ్రెసేతర కూటమి అని పదే పదే కేసీఆర్ చెబుతూ వచ్చారు. కానీ ప్రస్తుతం నితీశ్.. కాంగ్రెస్‌తో కూడా జత కడుతున్నారు. సోనియాను త్వరలో కలవబోతున్నారు. మరి కేసీఆర్ ఈ విషయంలో ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

సీఎం కేసీఆర్ వచ్చే వారం బీహార్ వెళ్లడానికి సిద్దపడుతున్నారు. వాస్తవానికి ఈ వారాంతంలోనే బీహార్ పర్యటన పెట్టుకున్నారు. అయితే జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌ల కూటమి కొత్త సర్కార్ ఇంకా సర్ధుకోలేదు. కాస్త స్థిమితపడిన తర్వాతే పాట్నా వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. అందుకే వచ్చే వారం బీహార్ వెళ్లి అక్కడే రెండు రోజుల పాటు ఉండాలని నిర్ణయించుకున్నారు. సీఎం నితీశ్ కుమార్, డిప్యుటీ సీఎం తేజశ్వీ యాదవ్‌తో ఆయన భేటీ కానున్నారు. ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేసే విషయంపై చర్చలు జరుపనున్నట్లు తెలుస్తోంది.

బీహార్ రాజకీయాల్లో వచ్చిన మార్పును తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా స్వాగతించారు. పాట్నాలో జరిపే చర్చల అనంతరం వీలుంటే స్టాలిన్‌ను కూడా కేసీఆర్ కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. నితీశ్, తేజశ్వీలు కనుక కేసీఆర్ ప్రతిపాదించే కూటమికి సై అంటే.. అది తప్పకుండా ఎన్డీయేకు గట్టి పోటీ ఇచ్చేదిగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అప్పుడు తప్పకుండా మమత, అఖిలేశ్, కేజ్రివాల్ వంటి నాయకులు పూర్తి మద్దతు ఇస్తారని, కేసీఆర్ జాతీయ రాజకీయ శక్తికి ఇది తప్పకుండా ఊతం ఇస్తుందని అనుకుంటున్నారు.

First Published:  13 Aug 2022 7:56 AM GMT
Next Story